రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 11:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉండనున్నందున అందుకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారుతో కలెక్టరేట్ లోని విసి హాల్ లో జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతియేడు మాదిరిగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఈనెల 17వ తేదీన హకీంపేట ఎయిర్పోర్టులోకి వచ్చి అక్కడ నుంచి బొల్లారం చేరుకుంటారని అనంతరం 21వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో ఉంటారని వివరించారు. రాష్ట్రపతి రానున్న సందర్భంగా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వహించాలని తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రపతికి ఆహ్వానం పలికేందుకు విఐపిలు వస్తారని అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. రోడ్లు ఎలాంటి గుంతలు, గతుకులు లేకుండా చూడాలని అందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి రోడ్లను బాగు చేయాలని దీంతో పాటు షామియానాలు (టెంట్లు), కుర్చీలు, వేదికకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ అధికారి కి సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు సైతం ఎక్కడ కూడా చెత్త కనబడకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత కమిషనర్కు సూచించారు అలాగే విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకుగాను అవసరమైన మరమ్మతులు, చర్యలు తీసుకొని నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరాను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డిఓలు శ్యాం ప్రకాష్, సైదులు, ఎసిపి రాములు, ఆయా శాఖల జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు శాఖల అధికారులు, తహాసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking