ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్

* కాటేదాన్‌లో సెంచురీ ఆస్ప‌త్రి ఉచిత వైద్య‌శిబిరం
* శ్రీ విప్ర‌సేవా సంఘం స‌హ‌కారంతో నిర్వ‌హ‌ణ‌

రాజేంద్రనగర్‌ ప్రజాబలం ప్రతినిధి: హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 1, 2023: న‌గ‌రంలో ప్ర‌స్తుతం వైర‌ల్ జ్వ‌రాలు, డెంగ్యూ వంటి వ్యాధులు తీవ్రంగా ఉన్నాయ‌ని, అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల‌ని రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ సూచించారు. న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన సెంచురీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో కాటేదాన్ బాబుల్ రెడ్డి న‌గ‌ర్‌లోని శ్రీ విద్యానికేత‌న్ హైస్కూల్లో ఆదివారం నిర్వ‌హించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయ‌న ప్రారంభించి, ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, నీళ్లు ఎక్క‌డా నిల్వ ఉంచ‌కూడ‌ద‌ని, అలా చేస్తే దోమ‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయ‌ని చెప్పారు. దాంతోపాటు ఆహారం తీసుకునేముందు త‌ప్ప‌నిస‌రిగా చేతులు ప‌రిశుభ్రం చేసుకోవాల‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ప్రైవేటు కార్పొరేట్ ఆస్ప‌త్రులు కూడా ఈ విష‌యంలో ముందుకొచ్చి ఇలాంటి వైద్య‌శిబిరాలు నిర్వ‌హించ‌డం అత్యంత ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. సెంచురీ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు స్వ‌యంగా ఇక్క‌డికొచ్చి కాటేదాన్ ప‌రిస‌ర ప్రాంతాల వాసుల ఆరోగ్యం కోసం నిర్వ‌హిస్తున్న ఈ శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

శ్రీ విప్ర‌సేవా సంఘం స‌హకారంతో నిర్వ‌హించిన ఈ శిబిరంలో సెంచురీ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు పాల్గొని, దాదాపు 540 మందికి దంత‌వైద్యం, ఈఎన్‌టీ, మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, ఊపిరితిత్తులు, ఆర్థోపెడిక్ విభాగాల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు చేశారు. వ‌చ్చిన‌వారంద‌రికీ బీఎంఐ ప‌రీక్ష‌లు కూడా చేసి, అవ‌స‌ర‌మైన‌వారికి మందులు అందించ‌డంతో పాటు వైద్య‌స‌ల‌హాలు కూడా ఇచ్చారు. ఆస్ప‌త్రి డీఎంఓ, గుండెవైద్య నిపుణురాలు డాక్ట‌ర్ స‌లేహా, ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్ట‌ర్ సుజిత్, ప‌ల్మ‌నాల‌జీ నిపుణుడు డాక్ట‌ర్ భ‌ర‌త్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్ వైద్యురాలు డాక్ట‌ర్ సీమ‌, దంత‌వైద్య నిపుణుడు డాక్ట‌ర్ న‌దీమ్,
ఆప్టోమెట్రీషియ‌న్ న‌వాజ్, టెక్నీషియ‌న్ సందీప్ త‌దిత‌రులు త‌మ సేవ‌లు అందించారు.

విప్ర‌సేవా సంఘం సభ్యుడు భోలా శంక‌ర్ శ‌ర్మ శిబిరానికి స్పాన్స‌ర‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. కార్య‌క్ర‌మంలో సంఘం అధ్య‌క్షుడు రాంబాబు కౌశిక్, సెక్ర‌ట‌రీ అరుణ్ గౌడ్, ట్రెజ‌ర‌ర్ ఉమేశ్ శ‌ర్మ‌, స‌భ్యులు సురేష్ శ‌ర్మ‌, రాజేంద్ర ప్ర‌సాద్ శ‌ర్మ‌, రాజ్‌కుమార్ శ‌ర్మ‌, వినోద్ లాటా, వినోద్ ముద్గ‌ల్, భగ‌వాన్ దాస్ కౌశిక్, స‌త్‌వీర్ శ‌ర్మ‌, నిర్గుణ్‌ లాల్ మిశ్రా, నారాయ‌ణ‌దాస్ శ‌ర్మ‌, చేత‌న్ ప్ర‌కాష్ శ‌ర్మ‌, మ‌నోజ్ శ‌ర్మ‌, ర‌త‌న్‌లాల్ శ‌ర్మ‌, భువ‌న్ లాల్ శ‌ర్మ‌, అనిల్ శ‌ర్మ‌, భానుప్ర‌కాష్ శ‌ర్మ‌, హేమ‌ల‌తా శ‌ర్మ‌, సంధ్యాశ‌ర్మ‌, విజేతా శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking