ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 19 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నస్పూర్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అక్కపురం రాజయ్య సింగాపూర్ గ్రామ శివారులో తనకు చెందిన భూమి సింగరేణి ఓపెన్ కాస్టులో పోయిందని,నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన కామెర లక్ష్మి,మేస్త్రి కీర్తిమాల తమకు సొంత ఇంటి స్థలం ఉందని,ఇందిరమ్మ ఇండ్ల పథకంను వర్తింప చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు.హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన తిప్పని సాయితేజ తనకు గల భూమి ఆక్రమణకు గురవుతుందని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.బెల్లంపల్లి పట్టణం రైల్వేస్టేషన్ రడగంబాలబస్తీకి చెందిన యాదారి కవిత తమ వార్డులో అంగన్వాడీ కేంద్రం దూరంగా ఉండడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని,మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి మేఘన జాతీయ రహదారి ఏర్పాటులో భాగంగా తన భూమి కోల్పోతున్నానని, బాధితుల జాబితాలో తన వివరాలు లేవని,నమోదు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తన దరఖాస్తులో మందమర్రి మండల శివారులోని ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీన పరుచుకుని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking