శివ నామస్మరణ తో మార్మోగుతున్న రాజన్న క్షేత్రం

 

అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

వేములవాడలో భక్తుల రద్దీ

భక్తులకు సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు

రాజన్న సేవలో పలువురు ప్రముఖులు

————————————
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ,
8, మార్చ్ 2024
ప్రజాబలం ప్రతినిధి
————————————

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారి నుంచే స్వామి వారికి అర్చకులు విశిష్ట సేవలు నిర్వహించారు. వేకువజామున చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో కాలినడకన వేములవాడకు తరలివచ్చారు. దీనితో దేవస్థాన పరిసర ప్రాంతాలు శివ నామ స్మరణతో  మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించారు. స్థానిక ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం స్వామి వారిని ఆయన దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 

       

ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

హైకోర్టు జడ్జి కె సురేందర్ కుటుంబ సభ్యులతో ఆలయానికి రాగ ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ హరికిషన్, అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆయనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, సబ్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, జ్యోతిర్మయి, సుజన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ ఎంఎల్ఏ గంగుల కమలాకర్, రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking