ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 03 : పాత సర్వే ప్రకారమే 63 వ ఫోర్ వే నేషనల్ హైవే లైన్ నిర్మించారని ఐబీ లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ కు వినతి పత్రం అందజేశారు.సోమవారం దండేపల్లి,లక్షెట్టిపేట మండలాల్లో భూములు కోల్పోనున్న నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూములనే నమ్ముకుని వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు.దండేపల్లి మండలంలోని కన్నెపల్లి లక్షెట్టిపేట మండలంలోని ఉత్కూర్ లోని పలు సర్వే నంబర్స్ లో భూములు జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని,పాత సర్వే ప్రకారం స్థానిక కరీంనగర్ చౌరస్తా మీదుగా ఫోర్ లైన్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.అధిక శాతం ప్రజలకు నష్టం కలుగుతున్న ఈ రహదారి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరారు.కాగా,భారత జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఉన్నత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎమ్మెల్యే హామీనిచ్చారు.అంతకుముందు బాధితులు అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించి,తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు.అనంతరం తహసీల్దార్ జ్యోత్స్న కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,నాయకులు రాజ లింగయ్య,కౌన్సిలర్లు, భూములు కోల్పోనున్న బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.