శభాష్.. జమ్మికుంట పోలీస్

– అత్యవసర సమయంలో స్పందించిన ఖాకీలు
– యువకుడి ప్రాణాలు కాపాడి.. క్షేమంగా ఇంటికి చేరవేత

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 19

విధి నిర్వహణలో నిబద్ధత చాటి జమ్మికుంట పట్టణ పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. శుక్రవారం అర్ధరాత్రి 11:30 గంటలకు డయల్ 100 నంబర్ కు వచ్చిన కాల్ కు.. వెంటనే స్పందించి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. హుజరాబాద్ మండల పరిధిలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన యువకుడు అంబాల రాహుల్ జీవితంపై విరక్తి చెంది రైల్వే ట్రాక్ పై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకోగా.. చూసిన స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్యూటీ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు టి. ఆనంద్, మరో హోంగార్డ్ విజేందర్ రంగంలోకి దిగి యువకుడిని పట్టుకున్నారు. సదరు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి క్షేమంగా ఇంటికి పంపించారు. అత్యవసర సమయంలో స్పందించి తమ కుటుంబ సభ్యుడైన రాహుల్ ను కాపాడినందుకు జమ్మికుంట పట్టణ పోలీసులకు రాహుల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking