విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలుస్తోంది
అద్భుత ఫలితాలు సాధిస్తున్న గురుకులాలు
విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ అమోఘం
తెలంగాణ విద్యా దినోత్సవంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 21: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా చదువుల తల్లి సరస్వతీ నిలయమని తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని ఈ విషయంలో ప్రభుత్వం పదేళ్ళ కాలంలో విద్యారంగంలో ఎన్నో మంచి మార్పులకు శ్రీకారం చుట్టి అందరికీ విద్యను అందేలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించామని మంత్రి తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ కాలంలో దేశంలోని అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో సాధించిన మార్పుకు సంకేతమన్నారు.అటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది విరివిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సర్కార్ చదువు అంటేనే విముఖత చూపించిన దుస్థితి నుండి సర్కార్ చదువులకై పోటీలు పడుతున్న మార్పును యావత్ తెలంగాణా సమాజం గమనించాలని ఆయన ఉద్బోధించారు.2014 కు ముందు వెనుక అన్నది అధ్యయనం చేస్తే విద్యా రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు బోధపడతాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండేలా ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని రూపొందించి విజయవంతమయిందని తెలిపారు. అలాగే తొలిమెట్టు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల వైపు చదువుకునేందుకు వచ్చేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మరిచేలా అన్ని వసతి గృహాల్లో మంచి నాణ్యమైన చదువు తో పాటు మంచి భోజనం అందిస్తోందని విద్యార్థులకు దుస్తులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి చదువులో రాణించేలా కృషి చేస్తోందన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లోకెల్లా ఉపాధ్యాయులే ప్రథమ స్థానంలో ఉన్నారని. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యారంగంలో ప్రభుత్వం ఎన్నో గుణాత్మక మార్పులు జరగడం అన్ని పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి మంచి పేరు తీసుకురావడం ఎంతో ఆనందకరంగా ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎప్పుడూ కూడా చదువు పట్ల అశ్రద్ధ వహించరాదని రాబోయే రోజుల్లో విద్యతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన కార్యాచరణ రూపొందించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో సకల వసతులు ఉన్నాయని ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మన ఊరు – -మన బడి పథకం విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయని జిల్లాలోని ఆయా పాఠశాలలలో దశల వారిగా మౌళిక వసతులను కల్పించడం జరుగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి వివరించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి రూ.7,300 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయమని ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. వీటితో పాటు విద్యార్థులకు మంచి చదువును అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ తదితర ఆధునిక సౌకర్యాలను కల్పించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆచరిస్తున్న విధానాలను దేశం అనుసరిస్తోందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.