– స్కూల్ బోర్డు కూడా లేని వైనం
– అపరిశుభ్ర పరిసరాలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రాథమిక ఉన్నత పాఠశాల
– పాఠశాల ఆవరణలోనే తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రగతి మొక్కలు
– ఇటీవల పాముకాటుకు గురైన చిన్నారి..స్టూడెంట్స్ కు పొంచిన ప్రమాదం
– పడావు పడి, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ను కూల్చివేయాలని గ్రామస్తుల వేడుకోలు
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 24
జమ్మికుంట మండల పరిధిలోని శాయంపేట గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. పాఠశాలకు కనీసం గా స్కూల్ బోర్డు కూడా లేని దుస్థితి నెలకొంది. పాఠశాల ఆవరణలో పడవు బడి, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. విద్యకు నిలయంగా ఉండే పాఠశాలలో బీరు బాటిల్ దర్శనమిస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాలంటేనే భయం భయంగానే వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఓ చిన్నారి పాము కాటుకు గురి కాగా ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని, ఆరోగ్యంగా ఉన్నదని స్కూల్ ఇన్ చార్జి హెచ్ఎం వరలక్ష్మి, టీచర్ తిరుపతి పేర్కొన్నారు. అపరిశుభ్రతకు ఆలవాలంగా పాఠశాల పరిసరాలు ఉండటంతో .. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
పట్టింపు లేని అధికారులు?
పాఠశాల ఆవరణలోని పల్లె ప్రగతి మొక్కలు పక్కన పరిసరాలు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారాయి. మొక్కల నుంచే వచ్చే వాసన వలన కీటకాలు, విషపూరితమైన పాములు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ‘పల్లె ప్రగతి ‘ నిర్వహించడం సరికాదని అభిప్రాయం గ్రామస్తుల నుంచి వ్యక్తం అవుతున్నది.
సమస్యల పరిష్కారం అయ్యేది ఎప్పుడు?
తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు అని శాయంపేట గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న మ్యాన్ హోల్, సెక్షన్ కోసం నిర్మించిన భవనం, శిథిలావస్థకు చేరిన తరగతి గదిని వెంటనే కూల్చివేయాలని కోరుతున్నారు.
ఫిర్యాదు పట్టించుకోవట్లే?
శాయంపేట ప్రాథమికోన్నత పాఠశాలలోని శిథిలావస్థకు చేరిన అదనపు భవనాన్ని కూల్చివేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పై స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.
వెంటనే ఆసుపత్రికి తరలించాం
శాయంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం పాముకాటుకు గురైన విద్యార్థిని వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఇన్ చార్జి హెచ్ఎం వరలక్ష్మీ వివరణ ఇచ్చారు. విషయాన్ని వెంటనే మండల విద్యాశాఖ అధికారికి తెలియజేశానని వెల్లడించారు. ఎస్ జి టి తిరుపతి విద్యార్థిని జమ్మికుంట ఆసుపత్రి నుంచి హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ కి మెరుగైన వైద్యం తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్ ను సంప్రదించగా, పాఠశాల ప్రాంగణంలో పల్లె ప్రగతి నిర్వహించడంపై ఉన్నతాధికారులకు నివేదించినట్టు స్పష్టం చేశారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కోసం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
స్కూల్ బోర్డు తో పాటు పల్లె ప్రగతి నిర్వహణపై శాయంపేట గ్రామం పంచాయతీ సెక్రటరీ కిషన్ ను వివరణ కోరగా.. పల్లె ప్రగతి మొక్కల పెంపకాన్ని ఇతర చోటుకు తరలించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ”ప్రత్యేక” అధికారి, ఎంపిఓకు చెప్పినట్టు తెలిపారు. వారం పది రోజుల్లో స్కూల్ బోర్డు ఏర్పాటుకు కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు.