సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మృతి

 

సికింద్రాబాద్‌,ఫిబ్రవరి19సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచారు. పలువురు నేతలు సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్‌ఎస్‌ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. ఈ నెల 16న గుండెనొప్పితో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు. హృద్రోగ సమస్యలతో పాటు.. మధుమేహం వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కార్డియాక్‌ అరెస్ట్‌ రావడంతో.. గుండె పనితీరు ఆగి.. మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితమే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేశారని పేర్కొన్నారు.సాయన్న మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి కుటుంబసభ్యులు తరలించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి కేటీఆర్‌, ఇతర బీఆర్​ఎస్​ నేతలు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయన్న మృతితో పలువురు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా ప్రస్థానం: టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన సాయన్న.. 1994,1999,2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో.. బీఆర్‌ఎస్‌లో చేరి 2018 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు. హుడా డైరెక్టర్‌గా 6సార్లు సాయన్న బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా నియామకం అయ్యారు. వీధి బాలలకు పునరావాసంపై ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయన బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. వివాద రహితుడిగా ఉన్న సాయన్న.. ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేస్తూ.. స్థానిక ప్రజల మెప్పు పొందారు

Leave A Reply

Your email address will not be published.

Breaking