* జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
* జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు
మహిళలు, విద్యార్థినులు తమ స్వీయ రక్షణకై రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా తమని తాము ఆపద సమయాల్లో రక్షించుకోవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తంగలపల్లి మండలం మండేపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఆపరేషన్ జ్వాల -2 పేరుతో స్వీయ రక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించి మాట్లాడారు. గతేడాది జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల (సెల్ఫ్ డిఫెన్స్ )తో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో సుమారు 2000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ జ్వాల -2 పేరుతో స్వీయ రక్షణ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని, ఆపరేషన్ జ్వాల పేరుతో వారి రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో స్వీయ రక్షణపై అనుభవం కలిగిన శిక్షకులచే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ మహిళలు, విద్యార్థినులకు వారి ఆపద సమయాల్లో ధైర్యంగా సమస్యలు ఎదుర్కొవడములో ఉపయోగపడుతుందని తెలిపారు. చైన్ స్నాచింగ్, లైంగిక దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో పట్టు సాంధిచవచ్చని వెల్లడించారు. తెలంగాణ పోలీసులు మహిళలు, విద్యార్థినుల రక్షణకై నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. “షీ టీమ్” పోలీసులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు అయిన బస్ స్టాండ్స్, తదితర ప్రాంతాల్లో సివిల్ దుస్తుల్లో సంచరిస్తూ ఆకతాయిల బారి నుండి రక్షణ కల్పించే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. మహిళ, విద్యార్థినులు ఏలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా ముందుకు వచ్చి డయల్ 100కి సమాచారం అందించాలని సూచించారు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలను తీసుకోవడం ద్వారా నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మొగిలి, ఎస్.ఐ సుధాకర్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, కరాటే శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.