ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన జడివానకు గ్రామమంతా జలమయంగా మారింది. గ్రామం లోని పలు వాడల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజా జీవినం అస్తవ్యస్తంగా మారింది.రాత్రి ముసురు ఏకదాటిగా కురువడం వలన రోడ్లన్నీ బురదమయంగా మారాయి.అంతేకాకుండా గ్రామ పంచాయతి డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు ఇండ్లలోకి వస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటగూడెం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్పంచ్,స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. ముందు చూపు లేని డ్రైనేజితో ముప్పతిప్పలు పడుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు.కాగా, జేసీబీ తో మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపారు.