జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 08 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. లక్షెట్టిపేట మండలం హన్మంతుపల్లె గ్రామానికి చెందిన సంకోజి శంకరయ్య తనకు చందారం శివారులో భూమి ఉందని,కొంత భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం హన్మంతుపల్లె గ్రామ రైతులు తాము తమ వ్యవసాయ భూములలోకి వెళ్ళేందుకు ఉన్న దారి పిచ్చిచెట్లతో నిండి ఇబ్బందికరంగా ఉందని,చెట్లను తొలగించి దారిని చదును చేసి ఆ దారిలోని ఒర్రెపై నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమారం మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల చిన్నమల్లయ్య తనకు గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమి ఆన్లైన్లో ఇతరుల పేరిట పట్టా చూపుతుందని,ఈ విషయంలో విచారణ జరిపి తన పేరిట తిరిగి పట్టా మార్పు చేసి ఇవ్వగలరని కోరుతూ అర్జీ సమర్పించారు.మంచిర్యాల పట్టణంలోని హమాలివాడకు చెందిన ఉప్పరి సాగర్ హమాలివాడ నుండి తిలక్నగర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, మురుగు కాలువలు లేక, త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ పనుల విషయంలో సమగ్ర విచారణ జరుపాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.బెల్లంపల్లి మండలం బూదకుర్దు గ్రామానికి చెందిన ముత్తె అపర్ణ తనకు గ్రామ శివారులో భూమి ఉందని, ధరణిలో చూపించడం లేదని, ఇట్టి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఏనుగు భూపతిరెడ్డి తన దరఖాస్తులో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపు గురైన వారి మేజర్ సన్స్కు వారికి అందించే పరిహారం తన కుమారుడు,మానసిక దివ్యాంగుడు అయిన శ్రావణ ్కుమార్కు ఇప్పించాలని కోరారు. కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొర్రె రాజయ్య తమకు వారసత్వంగా వస్తున్న భూమి పట్టా,భూయాజమన్య పత్రంలో తక్కువ విస్తీర్ణం చూపుతుందని, ఈ పొరపాటును సవరించి తనకు గల భూమి విస్తీర్ణం నమోదు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 54 దరఖాస్తులు అందాయని,ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.