మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జనవరి 19: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 20, 21వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ దిశగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రత్యేక క్యాంపెయిన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు కానివారు ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు, చిరునామా తదితర సవరణల గురించి జిల్లాలో రెండు రోజులపాటు స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణ గురించి చేసిన షెడ్యూల్లో ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితా సంబందిత ఫారం (6 మరియు 8) లతో ఈ రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ నమోదుకు, ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక పోలింగ్ కేంద్రానికి మార్పు, సవరణలు ఇతర అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ కోరారు.