సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు

స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
ప్రణాళికలు సిద్దం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్‌ సముచితమైన స్థానమని, అక్కడే తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. అందులో భాగంగా సచివాలయ ఆవరణలో ఉన్న తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తో కలిసి స్వయంగా తిరిగి పరిశీలించారు.
ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్‌ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking