ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) సోమవారం హైదరాబాద్ నుండి ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి కేంద్రంలోనూ ఆరోగ్య సిబ్బందిని నియమించాలని, ప్రాథమిక చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారంతోపాటు, పరీక్షల పట్ల విద్యార్థులలో నెలకొని ఉన్న ఆందోళనను దూరం చేసేలా కౌన్సిలింగ్ అందించేందుకు వీలుగా వైద్యారోగ్యశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన టెలీ మానస్ – 14416ను వినియోగించుకోవచ్చని సూచించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం కల్పించకూడదన్నారు. ప్రతి కేంద్రంలోను త్రాగునీటి వసతి, సరిపడా ఫర్నీచర్, ఇతర కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు హాల్ టిక్కెట్లను నేరుగా వెబ్-సైట్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. http://tsbie.cgg.gov.in సైట్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందవచ్చని సూచించారు. ఎక్కడైనా కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వనట్లయితే, విద్యార్థులకు సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకుగాను ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్ధం రాష్ట్ర స్థాయిలో 040-24601010, 24655027 నంబర్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. 10 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశామన్నారు. 17,890 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 17,967 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటల కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన అన్నారు. జిల్లా లో 9948904023, 7793916207 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలను సజావుగా చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా రవాణాధికారి టి. కిషన్ రావు, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.