పాతనగర ప్రజలకు మోసం చేస్తే ఉరుకునేదిలేదు
– పాతనగర మెట్రో రైల్ జేఏసీ నేతల హెచ్చరిక
హైదరాబాద్ సెప్టెంబర్ 30 ();హైదరాబాద్ పాతనగర ప్రజలకు మోసం చేస్తే ఉరుకునేదిలేదని, మెట్రో రైల్ సాధనకు పోరాటాలు తీవ్రతరం చేస్తామని పాతనగర మెట్రో రైల్ జేఏసీ నేతలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందులో భాగంగా అక్టోబర్ మొదటి వారంలో ప్రతిపాదిత ఫలక్ నుమా మెట్రో రైల్ డిపో వద్ద వేలాదిమందితో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. హైదరాబాద్, న్యూస్ సర్వీస్ సిండికేట్ హాల్ లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో పాతనగర మెట్రో రైల్ జేఏసీ నేతలు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి. నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, టీపీసీసీ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి ఉస్మాన్ బిన్ మొహమ్మద్ ఆల్ హాజరీ, టీపీసీసీ నాయకులు చార్మినార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె. వెంకటేష్, టిటిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దోజు రవీంద్ర చారి, బిఆర్ఎస్ పాతనగర నాయకులు సయ్యిద్ సలీం, సిపిఐ పాతనగర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూసా ఖాసీం, హైదర్ జాఫ్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ.టి. నరసింహ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో సగం జనాభా కలిగిఉన్న పాతబస్తీలో మెట్రో రైల్ విస్తరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం వహించడం సిగ్గుచేటన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ విస్తరణను తక్షణమే ప్రారంభిస్తున్నామని సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో హామీ ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇప్పటివరకు ఎందుకు పనులు ప్రారంభించలేదని అయన ప్రశ్నించారు. పాతబస్తీ అభివృద్ధికి సహకరించని ఎంఐఎం ఒత్తడితో ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ పనులు ఆపితే ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని అయన హెచ్చరించారు. ఏంజిబిఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఈ.టి. నరసింహ డిమాండ్ చేసారు. ఉస్మాన్ బిన్ మొహమ్మద్ ఆల్ హాజరీ మాట్లాడుతూ పాతబస్తీని ఇస్తాంబుల్ నగరంగా మారుస్తామన్న మంత్రి కేటీర్, కనీసం పాతబస్తీలో మెట్రో రైల్ పనులను ప్రారంభించాక పోవడం సిగ్గుచేటన్నారు. మెట్రో రైలు కనెక్టివిటీ లేకపోవడంతో పాతబస్తీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మెట్రో రైల్ విస్తరిస్తామని పాతబస్తీ ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరిస్తోందని ఆరోపించారు. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని అయన డిమాండ్ చేసారు. కె.వెంకటేష్ మాట్లాడుతూ పాతబస్తీకి చెందిన చాలా మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం ప్రతిరోజూ దూర ప్రయాణాలు కొనసాగిస్తుంటారని, సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర రవాణా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఓల్డ్ సిటీ వరకు మెట్రో లైన్‌ను పొడిగించడంలో జాప్యానికి నిరసిస్తూ పాతనగర మెట్రో రైల్ జేఏసీ అనేక ఆందోళనలు నిర్వహించిన ప్రభుత్వంలో చలనం రాకపోవడం దుర్మార్గమన్నారు. పాతబస్తీలో మెట్రో రైల్ కోసం డిమాండ్ చేస్తూ నిరంతరం నిరసనలు కొనసాగిస్తామని కె. వెంకటేష్ హెచ్చరించారు. పెద్దోజు రవీంద్ర చారి మాట్లాడుతూ రోజూ దూర ప్రాంతాలకు వెళ్లే పాతబస్తీ వాసులకు మెట్రో రైలు ఎంతో ఊరటనిస్తుందని, నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పనులు పూర్తయ్యి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, పాతబస్తీలో మెట్రో రైలు పనుల ఊసే లేదని విమర్శించారు. పాత బస్తీ అభివృద్ది దేవుడెరుగు అన్నట్టుగా బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పాతబస్తీ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని అయన డిమాండ్ చేసారు.