పైసలివ్వనిదే సంతకం పెట్టనన్న హెచ్.ఎం
పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ..!
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 2(ప్రజా బలం) ఉపాధ్యాయ శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న నిరుద్యోగుల పాలిట ఆ హెచ్.ఎం. యముడయ్యాడు.. టీచర్స్ ట్రైనింగ్ లో భాగమైన ఓ బడిలో బోధన తరగతులకు హాజరై ఆ హెచ్.ఎం సంతకం కోరితే మామూళ్లు అడగడంతో చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరిన సంఘటన ఇది. జగిత్యాల పట్టణ శివారులోని ఓ బి.యి.డి కళాశాలలో కొందరు విద్యార్థిని, విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరి రెండేండ్ల బియిడి కోర్సులో భాగంగా ప్రతి ఏటా ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ బడిలో పది రోజులపాటు విద్యార్థులకు పాఠాలు భోధించాలి. ఇలా పూర్తిచేసిన విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు అర్హులుగా ఎంపికవుతారు. కాగా జగిత్యాల లోని కొత్తవాడ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో బోధన కు ఎంపికై తరగతులకు హాజరై పూర్తిచేసిన కొందరు ట్రైనర్స్ ను అక్కడి ప్రధానోపాధ్యాయుడు సంతకం పెట్టేందుకు లంచం అడిగినట్లు తెలిసింది. ఇప్పటికే టీచర్ ఉద్యోగాలు రాక, ఒక్క ఏడాది కోర్సు రెండేండ్లు చేయాల్సి వస్తోందన్న ఆందోళనతో ఉన్న సదరు విద్యార్థులలో కొందరు డబ్బులిచ్చేందుకు ఒప్పుకొనట్లు తెలిసింది. దీనితో సదరు ప్రధానోపాధ్యాయుడు ఎక్స్ పిరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇందులోని ఓ టీచర్స్ ట్రైనీ విద్యార్థి కి జగిత్యాల టౌన్ లోని ఒక ఎస్.ఐ తో ఉన్న పరిచయం కాస్తా ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్లు తెలిసింది. దీనితో ఆందోళన చెందిన సదరు ప్రధానోపాధ్యాయుడు విషయం చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో రాయబారాలకు తెరలేపినట్లు తెలిసింది. ఇక సదరు ఎస్.ఐ. కేసు నమోదు చేసి ఆ ప్రదానోపాధ్యాయుడిపై చర్యలు చేపడుతాడా..మిగతా కేసుల్లాగా మిస్సింగ్ అవుతుందా వేచిచూడాలని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జోరందుకొంది.