సర్వేలో దేశానికే ఐకాన్ గా తెలంగాణ

– వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా నవంబర్ 7: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే దేశానికే ఐకాన్ గా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట చౌరస్తా కూడలి వద్ద సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే పై ఎన్యుమరేటర్ల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.సర్వే చేపడుతుండగా ప్రజలందరూ సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు.సర్వే తో భవిష్యత్తులో ప్రజలకు ఎన్నో లాభాలు కలుగుతాయన్నారు.రాజకీయంగా ఆర్థికంగా ఇలా ఎన్నో విధాలుగా ఈ సర్వే దోహదపడుతుందన్నారు. మూడు రోజులపాటు ప్రతి ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేటర్లు స్టిక్కర్లను వేస్తారని పేర్కొన్నారు.ఈ నెల 9వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా విస్మరించకుండా సమగ్ర వివరాల కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారన్నారు.ఏ కుటుంబమైన ఎక్కడికైనా వెళ్లిన కూడా తిరిగి వచ్చి సర్వే వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.సర్వే పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.వారం రోజులుగా సర్వేపై విస్తృత ప్రచారాన్ని అధికార యంత్రాంగం నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తో దేశంలోనే రాష్ట్రం ఐకాన్ గా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని అన్నారు.ఈ సర్వే గురించి తన చుట్టుపక్కల వారికి తెలియజేయాలని కోరారు.ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రం లో చేపట్టిన ఈ సర్వే దేశానికి దిక్సూచిగా మారబోతుందన్నారు.అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు.ప్రతి కుటుంబం సర్వేలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో సగం గ్రామీణ ప్రాంతం తో పాటు మరో సగ భాగం పట్టణ ప్రాంతంగా మిళితమై ఉందని పేర్కొన్నారు.సర్వే చేపట్టేందుకు జిడబ్ల్యూఎంసి పరిధిలో 800 వరకు ఎన్యూమరేషన్ బ్లాకులు గా గుర్తించామని అన్నారు. ఎన్యుమరేషన్ బ్లాకు ల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల తో పాటు ఆర్పీలు,అంగన్వాడీ టీచర్లను ఎన్యుమరేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. ఎన్యుమరేటర్లు సర్వే చేస్తుండగా పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు.సర్వే అనేది రెండు భాగాలుగా జరుగుతుందన్నారు. మొదటి దశలో మూడు రోజులపాటు ప్రతి ఇంటికి స్టిక్కర్ ను అతికించడం జరుగుతుందన్నారు.ఇంటింటికి స్టిక్కర్లు అతికించిన అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబం యొక్క సమగ్ర వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారని చెప్పారు.ఎన్యుమరేషన్ బ్లాక్ లోని ప్రతి ఇంటికి స్టిక్కర్ను తప్పనిసరిగా అంటిస్తారని,వచ్చేవారం సర్వే కోసం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్ కు సరైన వివరాలను ఆయా కుటుంబాల వారు తెలియజేయాలన్నారు.ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,పాస్ బుక్ లు ఉన్నట్లయితే సర్వే కు సంబంధించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్ కు ఇవ్వడానికి సులువుగా ఉంటుందన్నారు.సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.సర్వేలో సరైన వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో సామాజిక ఆర్థిక సర్వే కు ప్రజలు సహకరించాలన్నారు.కాజీపేట వాటర్ ట్యాంక్ సమీపంలో సామాజిక ఆర్థిక సర్వే స్టిక్కర్లను ఎన్యూమరేటర్లు ఇంటింటికి అతికిస్తుండగా ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ రజాలి, కాజీపేట తహసిల్దార్ బావ్ సింగ్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్,ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking