తెలంగాణా హక్కులకు విఘాతం కలిగితే సహించేది లేదు
ప్రాజెక్టుల అప్పగింతను అడ్డుకుంటాం
కేంద్రం పునరాలోచించాలి
ప్రాజెక్టులపై పార్లమెంట్ లో లేవనెత్తుతాం
తెలంగాణా ప్రాజెక్టులను కే ఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో కలిసి లేఖ అందజేసిన బీఆర్ ఎస్ పార్టీ ఎంపీల బృందం
న్యూఢిల్లీ ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ లను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర మంత్రి కి లేఖను అందజేశారు. తెలంగాణా లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజల హక్కులకు , తెలంగాణా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.ఈ విషయమై పార్లమెంట్ లో చర్చకు లెవనెత్తుతామని చెప్పారు వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్ ను కోరినట్లు ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణా ప్రాజక్టులను కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు అమోదయోగ్యం కాదని నామ పేర్కొన్నారు. కొన్ని న్యాయబద్ద హక్కులు కోసం పట్టుబడుతున్న తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తెలంగాణా ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించడానికి ఆపరేషనల్ ప్రోటోకాల్ ఖరారు చేయాలని, నీటి వాటాలు తేల్చాలని ఇప్పటికే తెలంగాణ కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు.విద్యుత్ ప్రాజక్టులను భౌగోళిక పద్ధతులు ద్వారా నియంత్రించాలని తెలంగాణా పట్టుబట్టిందని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 264 టీఎంసీలు నీటిని సరఫరా చేసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగిందని, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 830 అడుగులని పేర్కొన్నారు. దీని నుంచి సీడబ్యుసీ ఆమోదించిన 34 టీఎంసీ మాత్రమే బయటి బేసిన్ కు మల్లింపులకు పరిమితమై ఉండేలా కట్టడి చేయాలని కేంద్ర మంత్రి కి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు నామ చెప్పారు. తాగునీటికి వినియోగిస్తున్న జలాలను 20 శాతంగానే పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.క్యారీ ఓవర్ స్టారేజీ కి అవకాశం ఇవ్వాలని, తెలంగాణా కు కేటాయించిన నీటిని అదే సంవత్సరం కాకుండా తదుపరి సంవత్సరం లో వాడుకునే అవకాశం ఉండాలని కేంద్ర మంత్రి ని కోరినట్లు తెలిపారు. సీడబ్యుసీ అనుమతి లేని పక్షంలో బయటి బేసిన్ కు జలాలు తరలించే ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర మంత్రి ని కోరినట్లు చెప్పారు. తెలంగాణ షరతులన్నింటికి ఒప్పుకుంటేనే , ఆపరేషన్ ప్రోటోకాల్ పూర్తి అయితేనే ప్రాజెక్టులను అప్పగించాలని తెలంగాణా భావిస్తుందని బోర్డు సమావేశంలో స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు. ఎన్ఎస్పీ డ్యామ్ పై సీఆర్పీఎఫ్ బలగాలు అవసరం లేదని కేంద్ర మంత్రి కి అందజేసిన లేఖలో పేర్కొన్నట్లు నామ వివరించారు. ఏపీఆర్ ఏ సెక్షన్ 87 ప్రకారం జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులకు సంబంధించి భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాజెక్టులపై కే ఆర్ ఎంబీ అధికార పరిధిని కలిగి ఉంటుందని, ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్య వాటాల విభజన జరగలేదని , షరతులకు లోబడి ప్రాజెక్టులను అప్పగించాలని తెలంగాణా భావిస్తుందని అన్నారు. తాము లేవనెత్తిన అంశాలను తీవ్రంగా పరిగణలోకి తీసుకుని, ఆలోచించాలని కేంద్ర మంత్రి కి స్పష్టం చేశామని కేశవరావు, నామ నాగేశ్వరరావు తెలిపారు.కేంద్ర మంత్రి ని కలిసిన బీఆర్ ఎస్ పార్టీ బృందంలో పార్టీ ఎంపీ లు జి. రంజిత్ రెడ్డి, బి. వెంకటేష్ నేత, బీ. లింగయ్య యాదవ్, ఆర్. సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు