దాతర్ పల్లి గ్రామ దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి…

 

మెదక్ తూప్రాన్ అక్టోబర్ 26 ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామానికి చెందిన దళితులను దాడి చేసి, దౌర్జన్యంగా కులం పేరుతో దూషించిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటి డిమాండ్ చేసింది. గురువారం నాడు దాతర్ పల్లి గ్రామాన్ని సందర్శించి దళితులపై జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతర్ పల్లి గ్రామంలో దళితులపై కుల వివక్ష కొనసాగుతుందన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కొందరు గతంలో జరిగిన గొడవను మనసులో ఉంచుకొని దసరా పండుగ సందర్భంగా దళితులు తమ బస్తిలో ఉత్సాహంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక ఒక పథకం ప్రకారమే దాడిచేసి దౌర్జన్యానికి కుట్ర పన్నారన్నారు. రాత్రి జరిగిన సంఘటన విషయమై మాట్లాడుకుందామని మరుసటి రోజు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దళితులను గ్రామంలోకి పిలిచి దౌర్జన్యం చేయడం సిగ్గుచేటన్నారు. సంఘటన పై బాధిత దళితులు తూప్రాన్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారని అన్నారు. దళితులపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడి, కులంపేరుతో దూషించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అదే విధంగా దళితులపై అక్రమంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌంటర్ కేసులతో దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పోలీసు అది తగదని అన్నారు. దాతర్ పల్లి దళితులకు న్యాయం జరిగేవరకు ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, ఊషన్న గల్ల మురళి మాదిగ, గజ్జెల బిక్షపతి మాదిగ, చెట్ల పల్లి యాదగిరి మాదిగ, సర్గల పర్శరాములు మాదిగ, ఎన్నెల్లి సుధాకర్ మాదిగ, కాళ్లకంటి సత్యనారాయణ మాదిగ, కిచ్చిగారి యాదగిరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking