వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలి

ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలి
ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం
విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి
కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ కి వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ. 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వివరాలను తెలిపారు. పూర్తి అంచనాల తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.

 


వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి చౌహన్‌, బండి సంజయ్‌ కుమార్‌ తో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి వెంట ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని పవర్‌ పాయింట్‌ ద్వారా వాటి వివరాలను తెలియజేశారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వంద శాతం ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారు. గతంలో ఉన్నట్లుగా ఈ నిబంధనను సడలించాలని ముఖ్యమంత్రికోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking