బియ్యాన్ని స్వీకరించి, మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని భారత ఆహార సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశం
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టర్ స్థానిక భారత ఆహార సంస్థ గోడౌన్లను సందర్శించి, సీఎంఆర్ బియ్యం అన్ లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఒక్కో లారీ అన్ లోడ్ కి ఎంత సమయం పడుతుంది, ప్రక్రియ ఎలా చేపడుతోంది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 64 రైస్ మిల్లులు ఉన్నట్లు, ఇవి రోజువారి 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. రోజు కనీసం 2,000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యం భారత ఆహార సంస్థ స్వీకరించాల్సి ఉండగా, స్థలం లేదని 1,200 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటున్నందున, మిల్లులో నిల్వలు పేరుకుపోయి, ధాన్య సేకరణకు సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. భారత ఆహార సంస్థ కు 75,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉన్నట్లు, వీటిలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సిఎంఆర్ బియ్యం సేకరణకు కేటాయించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉన్నందున, జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. రఘునాథపాలెం లో 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఎస్ డబ్ల్యూజి గోడౌన్లు ఉన్నట్లు, వాటిని భారత ఆహార సంస్థ లీజుకు తీసుకొని నిల్వకు స్థల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. టోకెన్ల జారీ, లారీల కదలికలు, అన్ లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆయన అన్నారు. రహదారిపై వేచియున్న లారీల భద్రతపై చర్యలు తీసుకోవాలని, సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ధాన్య సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా, మిల్లర్ల నుండి సిఎంఆర్ బియ్యం వెంట వెంటనే ఆమోదించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధికా గుప్తా, భారత ఆహార సంస్థ డివిజనల్ మేనేజర్ రంగ ప్రసాద్ నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, అధికారులు తదితరులు ఉన్నారు.