ఓటరు జాబితా రూపకల్పన సమర్థవంతంగా నిర్వహించాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08:
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎం.ఎల్‌.సి.ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు,రాజస్వ మండల అధికారులు, తహసిల్దార్లతో జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ… పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎం.ఎల్‌.సి. ఎన్నికలకు సంబంధించి
కార్యచరణ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన మొదటి రిపబ్లికేషన్‌,25వ తేదీన 2వ రిపబ్లికేషన్‌ చేయడం జరుగుతుందని, నవంబర్‌ 6వ తేదీన నమోదు చేసుకునేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నవంబర్‌ 20వ తేదీన నమోదు అయిన దరఖాస్తులను పరిశీలించి ముసాయిదా జాబితా సిద్దం చేసి 23న ప్రచురించడం జరుగుతుందని,23 నుండి డిసెంబర్‌ 9వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, డిసెంబర్‌ 25 వ తేదీన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించి సంబంధిత పత్రాలను పరిశీలించి 30వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్ నియోజకవర్షాలకు జరుగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎం.ఎల్‌.సి.ఎన్నికలలో అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.వివరాల కొరకు, దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో తహశిల్దార్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.అర్హత గల వారు పట్టభద్రుల ఎం.ఎల్‌.సి.కొరకు ఫారం-18,ఉపాధ్యాయుల ఎం.ఎల్‌.సి. కొరకు ఫారం-19 ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.ఉపాధ్యాయుల శిక్షకుడిగా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)జె.శ్రీనివాస్,పట్టభద్రుల శిక్షకుడిగా హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి లను నియమించడం జరిగిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఓటరు నమోదు కొరకు దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని, కార్యచరణ ప్రకారం దరఖాస్తులను పరిశీలించి జాబితా సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులను అన్ని తహసిల్దార్,రాజస్వ మండల అధికారి కార్యాలయాలు, కలెక్టరేట్ లో స్వీకరించడం కొరకు ప్రత్యేక సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ప్రతి దరఖాస్తును పరిశీలించి జాబితాలో పేరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని, ఓటరు నమోదు కొరకు దరఖాస్తుల స్వీకరణ పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking