తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్దం

 

ప్రభుత్వ సూచనల మేరకు దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

అంగరంగ వైభవంగా ప్రతిరోజూ కార్యక్రమాల నిర్వహణకు పూర్తి కార్యాచరణతో ఉత్సవాలు

జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 1:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నారని… ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా ఈనెల 2వ తేదీ (శుక్రవారం) నుంచి 22వ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో రూపొందించి విజయవంతమయ్యేలా అన్ని శాఖలకు దిశానిర్ధేశం చేసినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నుంచి మొదలుకొని ఈ నెల 22వ తేదీ వరకు ప్రతిరోజూ రోజుకు ఒక కార్యక్రమాన్ని అన్ని శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా ప్రత్యేక అధికారిణిగా బోయి విజయేందిరను ప్రభుత్వం నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం జరిగే ఉత్సవాలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఐదుగురు జిల్లా అధికారులతో నియోజకవర్గ స్థాయిలో మొదలుకొని ఐదుగురు అధికారులను మండల స్థాయిలో ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి ప్రభుత్వం సూచించిన మేరకు కార్యక్రమాలు ప్రారంభం నుంచి చివరి రోజు వరకు విజయవంతమయ్యేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణ, అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణిలు వ్యవహరించనున్నారని వారు జిల్లాలో జరిగే ఆయా కార్యక్రమాలపై ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకాధికారులుగా మేడ్చల్ నియోజకవర్గానికి కీసర ఆర్డీవో రవి, మల్కాజిగిరి నియోజకవర్గానికి మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ జి.రాజు, కూకట్పల్లి నియోజకవర్గానికి మూసాపేట డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఉప్పల్ నియోజకవర్గానికి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, కుత్భుల్లాపూర్ నియోజకవర్గానికి డిప్యూటీ కమిషనర్ మంగతాయారు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. దీంతో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగిందని ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకాధికారులు వ్యవహరిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలు పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేయడంతో పాటు అవసరమైన దిశానిర్ధేశం చేసినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలల్లో మొదటి రోజైన జూన్ 2న జాతీయ పతాకావిష్కరణతో మొదలుకొని జూన్ 3వ తేదీన రైతు దినోత్సవం, జూన్ 4న పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, జూన్ 5న విద్యుత్తు విజయోత్సవం, జూన్ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే జూన్ 7న సాగునీటి దినోత్సవాన్ని, జూన్ 8న ఊరూరా చెరువుల పండగ, జూన్ 9న సంక్షేమ సంబురాల నిర్వహణ, జూన్ 10న సుపరిపాలన దినోత్సవం, జూన్ 11న సాహిత్య దినోత్సవం నిర్వహణ, జూన్ 12న తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహణ, జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం, జూన్ 14న వైద్య, ఆరోగ్య దినోత్సవం, జూన్ 15న పల్లె ప్రగతి దినోత్సవం, జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం, జూన్ 17న తెలంగాణ గిరిజనోత్సవం , జూన్ 18న మంచినీళ్ల పండగ, జూన్ 19న హరితోత్సవం, జూన్ 20న విద్యా దినోత్సవం, జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించి అనంతరం చివరి రోజైన జూన్ 22న అమరవీరుల సంస్మరణతో ముగుస్తుందని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాల వివరాలను పట్టణాల్లోనే కాకుండా గ్రామాలు, తండాలు, వాడవాడలా జరిగేలా అధికారులకు అవసరమైన సూచనలు చేశామని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, గ్రామస్తులతో అధికారులు సహపంక్తి భోజనాలు చేయాల్సి ఉంటుందని ఈ విషయాలను సైతం వారికి తెలియజేయడం జరిగిందని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి మొదలుకొని గ్రామస్థాయి వరకు ప్రతి అధికారి సంబంధిత గ్రామాల సర్పంచ్లు, మేయర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అందరితో కలిసిపోయి సంబురాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking