రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*జూన్ -02 నుంచి జూన్ -22 వరకు నిర్వహించు దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

*21 రోజుల పాటు ప్రతి రోజూ నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

*ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా సమన్వయంతో విజయవంతానికి కృషి

 *ఇప్పటి వరకు జరిగిన  ప్రభుత్వఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా నాడు – నేడు ఫ్లెక్సీ లు ఏర్పాటు

*ప్రసార మాధ్యమాల ద్వారా దశాబ్ది ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలి

*రాష్ట్ర దశాబ్ది వేడుకల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ప్రజాబలం జూన్ -01:జూన్ 2 నుండి 22 వరకు 21 రోజులపాటు నిర్వహించు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు.

గురువారం ఉదయం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలో 21 రోజులు పాటు ప్రతిరోజు నిర్వహించు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజులపాటు ప్రతిరోజు నిర్వహించు కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను రూపొందించి, సంబంధిత శాఖల అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి పకడ్బందీగా, సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ తానిపర్తి భాను ప్రసాద్ రావు విచ్చేసి ఉదయం 8-45 గంటలకు ఎం.పి.డి.ఓ. కార్యాలయం వద్ద గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించి, జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 8-58 గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు.

జూన్ 3న రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 54 రైతు వేదికల వద్ద క్లస్టర్ ల వారీగా స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి వ్యవసాయంలో సాధించిన ప్రగతి, ఆయిల్ పామ్ సాగు కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ముందస్తు సాగు, భవిష్యత్తులో అధిక పంట దిగుబడి సాధించుటకు జాగ్రత్తలను వివరించడం జరుగుతుందని, అనంతరం రైతులతో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నట్లు తెలిపారు.

జూన్ 4న సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖచే జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని, మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు మొదలగు తెలియజేస్తు పోలీస్ లతో ర్యాలీ  జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని అన్నారు.

జూన్ 5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవం నియోజకవర్గ స్థాయిలో, సింగరేణి ఏరియాలో నిర్వహిస్తామని,  వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా 24 గంటల సరఫరా, నాయి బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు  మొదలగు లబ్ధిదారుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

జూన్ 6న పారిశ్రామిక ఉత్సవం రామగుండంలోని కుందనపల్లి వద్ద పారిశ్రామిక  ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, టీఎస్ ఐపాస్ ద్వారా వచ్చిన పరిశ్రమలు, అందిన ఉపాధి, సులభతర అనుమతుల విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, టీ ఐడియా, టి ప్రైడ్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేస్తున్న కృషి మొదలగు అంశాలను వివరిస్తామని తెలిపారు.

జూన్ 7న సాగునీటి దినోత్సవం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తామని, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడియో విజువల్స్ చూపించడం జరుగుతుందని తెలిపారు.

జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ ప్రతి గ్రామ, మున్సిపాలిటీ స్థాయిలో సాయంత్రం వేళ చెరువు కట్ట వద్దకు బోనాలు, బతుకమ్మ లతో ప్రజలతో కలిసి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహణ, కట్ట మైసమ్మ పూజలు,  అనంతరం చెరువు కట్టపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులచే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

జూన్ 9న వివిధ శాఖలలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సంక్షేమ సంబరాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడంతో పాటు లబ్దిదారులకు గొర్రెల పంపిణీ, ఇళ్ల పట్టాలను అందించనున్నట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఉంటుందని, సంక్షేమ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించడంతో పాటు దాని వల్ల కలిగిన లాభాలను తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు.

జూన్ 10న జిల్లా స్థాయిలో తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు చేరువ అయ్యే విధంగా ప్రతి శాఖలో వచ్చిన మార్పులు , దానివల్ల కలిగిన లాభాలను వివరిస్తామని,  జూన్ 11న జిల్లా స్థాయిలో సాహిత్య దినోత్సవంలో కవి సమ్మేళనాలు, కవితల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

జూన్ 12న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ నియోజకవర్గం స్థాయిలో ఉంటుందని, జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసి మహిళలకు అందిస్తున్న బీడీ కార్మికుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, మొదలగు వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,  మహిళా ఉద్యోగులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు.

జూన్ 14న వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అందిస్తున్న వైద్య సేవలపై వివరించడంతో పాటు, కెసిఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్ లను నియోజకవర్గ స్థాయిలో అందించనున్నట్లు తెలిపారు. మన జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రామగుండం మెడికల్ కాలేజీలో పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహిస్తామని అన్నారు.

జూన్ 15న పల్లె ప్రగతి దినోత్సవం గ్రామ స్థాయిలో నిర్వహించి  పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన మౌళిక సదుపాయాలు, దేశవ్యాప్తంగా మన గ్రామాలకు వచ్చిన ప్రాముఖ్యత, అవార్డులు, మెరుగుపడిన పారిశుధ్యం, పచ్చదనం మొదలగు అంశాలను వివరిస్తామని, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రగతి నివేదిక చదివి వినిపిస్తామని, ఉత్తమ సర్పంచులు, ఎంపీపీ లను సన్మానించ నున్నట్లు తెలిపారు.

జూన్ 16న మున్సిపల్ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి దినోత్సవం ఉంటుందని,  మున్సిపాలిటీలలో వచ్చిన మార్పులు, ప్రజలకు అందుతున్న సేవలు కల్పించిన మౌళిక సదుపాయాలను వివరించడం జరుగుతుందని,  జూన్ 17న గిరిజన గ్రామాల్లో గిరిజన ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జూన్ 18న మంచినీళ్ల పండుగ సందర్భంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శన ఉంటుందని, గ్రామంలో. మహిళలచే సభ నిర్వహించి త్రాగునీటి కోసం కలిగిన ఇబ్బందులను అధిగమించిన అంశాలని వివరిస్తామని అన్నారు. జూన్ 19న హరితోత్సవం మొక్కలు నాటే కార్యక్రమా లను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు.

జూన్ 20న తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి విద్యా కేంద్రం, లైబ్రరీలలో కార్యక్రమాలు నిర్వహణతో పాటు బుక్స్ యూనిఫార్మ్స్ పంపిణీ చేయనున్నట్లు, అలాగే పూర్తి అయిన మన ఊరు మన బడి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థన మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జూన్ 22న గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయిలో అమరులకు నివాళులు అర్పించు కార్యక్రమంతో దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు.

దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రతి ఒక్కరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలను వివరాలను ముందస్తుగా ప్రజలకు చేరవేసే విధంగా, కార్యక్రమాల నిర్వహణను విస్తృత ప్రచారం కల్పించాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో, లోకల్ కేబుల్ చానెళ్ళలో  లైవ్ టెలికాస్ట్ లు చేసి 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking