రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 12 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి, ఖమ్మం నగరంలోని ఖిల్లాని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తామన్నారు. తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తామన్నారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యే లను తీసుకొని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు.ఈ క్రమంలో ఇప్పటికే వారు మహబూబ్ నగర్ జిల్లాలో కార్యక్రమం పూర్తిచేసుకుని ఖమ్మం జిల్లాలో ప్రారంభించారని వివరించారు. నెలకు ఒకసారి మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో కుటుంబాలతో సహా బస చేయాలని మంత్రి నిర్ణయించడం మంచి విషయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖిల్లాకు రోప్ వే కావాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని తెలిపారు. రోప్ వే నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతులు ఇస్తూ వెంటనే సంతకాలు చేశారని, త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించి, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నేలకొండపల్లి బౌద్ధ ఆరామాల వద్దకు జపాన్ లాంటి దేశాల నుంచి బుద్ధిష్టులను ఆహ్వానించాలన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి స్థానికంగా ఆదాయం పెరిగి యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కు కేంద్రమని, ఆ ఉద్యోగులు నెలకు ఒకసారి సెలవు దొరికితే ప్రశాంతంగా గడిపేందుకు అడవుల్లో ట్రిక్కింగ్, వాకింగ్ ట్రాక్, రిసార్ట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. వారానికి లేదా నెలకు ఒకసారి ఆటవిడుపు కోసం ఈ పర్యాటక ప్రాంతాలు ఉపయోగపడతాయన్నారు. ఆటవిడుపుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తే పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మం ఖిల్లాకి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని, మహా చారిత్రక కట్టడమని అన్నారు. ఆనాడు ఎలా నిర్మాణం చేశారు, ఎలా చేశారో చరిత్రను మననం చేసుకొని గుర్తుంచుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నేలకొండపల్లి భక్తరామదాసు, బౌద్ధస్తూపం లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశానన్నారు. రోప్ వే వేస్తే తప్ప, ఖిల్లాలో విహారానికి అవకాశం లేదన్నారు. మంచి కన్సల్టెన్సీ ద్వారా దీనికి రూపకల్పన చేయాలన్నారు. ఖిల్లా అభివృద్ధి కి ప్రతిరూపమని ఆయన తెలిపారు. భద్రాద్రి కి రైల్వే లైన్ కనెక్టివిటి వస్తున్నట్లు, నేషనల్ హైవే, విమాన సేవలు రావాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నుండి ఖమ్మం కు రాకుండా ఓఆర్ఆర్ ద్వారా నేరుగా భద్రాచలం వెళ్లుటకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. గోదావరిలో పాపికొండలు తదితర విహార యాత్రలకు ప్యాకేజీలు చేపట్టి పర్యాటకులను ఆకర్షించాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్తపుంతలు తొక్కనుందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెరగడంతో పేద ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రపంచంలో తక్కువ జనాభా, వనరులు లేకున్నా ఎన్నో దేశాలు టూరిజంలో పెరుగాంచాయన్నారు మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు, టూరిజం కి పెద్దపీట వేసి, అభివృద్ధికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఖిల్లాపై ఒక కి.మీ. మేర సుమారు 30 కోట్ల రూపాయలతో రోప్ వే నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. నిష్ణాతులు, సాంకేతిక నిపుణులు రప్పించి వీలయినంత త్వరలో నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో 2200 సంవత్సరాల పూర్వంవి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధస్తూపం, భక్త రామదాసు ధ్యానమందిరం, పాలేరు, వైరా రిజర్వాయర్లు ఎన్నో ఉన్నాయన్నారు ప్రారంభం చేసుకొని, పూర్తికాని వాటిని పూర్తి చేస్తామని, ప్రారంభించని వాటిని ప్రారంభిస్తామని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని, వివిధ మార్గాలుగా ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. వసతులు, వనరుల కల్పన చేయాలని, ఉద్యోగ, విద్యార్థులతో ఒక వారం ఒక వారం కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇకో టూరిజం, టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున చేపట్టి, జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేష్ రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, టూరిజం అధికారులు, తదితరులు పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking