పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 22:
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతికి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా పరితపిస్తంటారని ఈ విషయంలో రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలను దేశంలో కూడా అమలు చేస్తున్నారని ఇది ఎంతో గర్వకారణమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మంగళవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) దేవసహాయం, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించగా మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పరితపిస్తుంటారని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక రకాల పథకాలు అమలులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మీ పథకం కింద 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేస్తోందన్నారు. ఈ మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి లో ఈనెల 26వ తేదీన మూడు వేల మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షలకు సంబంధించి గృహలక్ష్మీ చెక్కులను అందచేస్తామని మంత్రి మల్లారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే దళితబంధు పథకం రెండో విడత కింద 1,100 మందికి త్వరలోనే పథకం కింద వారు దరఖాస్తు చేసుకొన్న వాటిని అందచేస్తామని తెలిపారు. బీసీ బంధు, మైనారిటీ బంధు అందుకు సంబంధించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకొన్నాము అని తెలిపినారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం, మన ఊరు – మనబడితో పాటు మరెన్నో కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని ఈ విషయంలో ప్రజల ఆదరణను చూరగొన్నామని…. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని జడ్పీ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి వివరించారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని ఇది ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని వారికి మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాల్సిందిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ఆయా కార్యక్రమాలపై జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా సంబంధిత శాఖల అధికారులు సమాధానాలిచ్చి అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజెప్పారు. ఈ సమావేశంలో జిల్లాలోని వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ ,జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking