ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి: రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం భోరజ్ మండలం హాతిగట్ గ్రామంలోని చనాక-కోరాట పంప్ హౌస్ హౌస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి లతో కలిసి బటన్ నొక్కి ప్రారంభించి, లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, రైతు అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదిలాబాద్ అడవుల జిల్లా వర్షాధార వ్యవసాయ సాగు చేస్తుందని, ప్రజల త్రాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రజల సుదీర్ఘ స్వప్నం పెన్ గంగ ప్రాజెక్టును సాకారం చేసిందని తెలిపారు. ప్రభుత్వం 1 వేయి 891 కోట్ల రూపాయల వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేయగా 5.12 టి.ఎం.సి. లా నీటిని వినియోగించుకునే విధంగా చనాక కొరాటా బ్యారేజీతో పాటు పెన్ గంగ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, బీంపూర్, జైనథ్, బేల మండలాలలోని 89 గ్రామాలలో 51 వేల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఆయకట్టుకు నీటిని అందించేందుకు డి14 నుండి డి19 గల ఉప కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రాజెక్టులు భాగంగా నీటిని నిల్వ చేసేందుకు పిప్పలకోటి బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. చనాక కొరాటtబ్యారేజ్ కు అనుబంధంగా ప్రధాన కాలువ, మోటార్లతో పంపు హౌస్ పనులు కొనసాగుతున్నాయని, తాంసి, భీంపూర్ మండలాలలోని 15 గ్రామాలలో గల 13 వేల 500 ఎకరాల నూతన ఆయకట్టును వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు 368 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుకు అనుబంధంగా ప్రధాన కాలువ 47 కి.మీ. నుండి 89.90 వరకు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు డి14 నుండి డి26 వరకు, పిప్పల్ కోటి నిల్వ జలాశయం నిర్మాణం ద్వారా తాంసి, బీంపూర్, ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలలో గల 75 గ్రామాలలో 51 వేల నూతన ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురావడం కొరకు 1 వేయి 227 కోటి రూపాయలు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులకు గాను 3 వేల 313 ఎకరాల భూ సేకరణ అవసరం ఉండగా ఇప్పటివరకు 1 వేయి 545 ఎకరాల భూమి సేకరించి 117 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా 138 కట్టడాలు చేపట్టడం జరిగిందని, సాత్నాల నదిపై 1.675 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రీకాస్ట్ పోస్ట్ టెన్షన్డ్ వయాడక్ట్ కొరకు 259.81 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉపకాలవల నిర్మాణం చేపట్టి నూతన ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంపొందించడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందని తెలిపారు.

అంతకుముందు హెలిప్యాడ్‌కు వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
అనంతరం పంపు హౌస్ వద్ద పోలీసు గౌరవ వందనం స్వీకరించి, ఫోటో స్టాల్ ను సందర్శించారు. నీటి విడుదలకు సంబంధించిన వివరాలను కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియజేశారు.
తదుపరి నాగోబా ఆలయ కమిటి సభ్యులు జాతరకు రావాలని ముఖ్యమంత్రి, మంత్రులను కలెక్టర్, ఎస్పీ లతో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించి నాగోబా ప్రతిమ గల మెమోంటో ను కలెక్టర్, ఎస్పీ అందజేశారు.

ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఆర్డీఓ స్రవంతి, ఎమ్మెల్సీ దండే విఠల్, జిసిసి చైర్మన్ తిరుపతి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, నీటిపారుదల శాఖ ఎస్ఈ విశ్వ కళ్యాణ్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు