ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02 : బహుజనుల రాజ్యాధికారం కొరకు పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని, మహనీయుల చరిత్రలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్థంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం,జిల్లా అధికారులతో హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బానిస ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాధికారం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని,ప్రభుత్వం మహనీయుల వర్థంతి, జయంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్రెడ్డి,జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి,జిల్లా వ్యవసాయ అధికారి కల్పన,సాంఘిక సంక్షేమశాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,వివిధ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు