టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు.సౌడమల్ల. యోహాన్, ఏబూసి. సంపత్
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 16
జర్నలిస్టు ఎండి యూసుఫ్ పై చందుర్తి పోలీసులు పెట్టిన అక్రమ కేసును తొలగించి, జైల్లో వున్న అతనిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల.యోహాన్, ఏబూసి.సంపత్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పోలీసులు ఇటీవల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్,సిరిసిల్ల జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన జర్నలిస్టు ఎండి యూసుఫ్ కు సంబంధంలేని ఒక కేసును అంటగట్టి అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. యూసుఫ్ పై పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరింపజేసి, అతనిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తప్పు చేయని జర్నలిస్టులపై ఇలా తప్పుడు కేసులు పెట్టడం తగదని, ఈ సంఘటనపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించి జర్నలిస్టు యూసుఫ్ పై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై అక్రమ కేసులు ఉండవని భావించామని, కానీ అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యూసుఫ్ ను విడుదల చేసి అక్రమ కేసు తొలగించాలని లేనిపక్షంలో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.