రాజన్న ఆలయంలో శివుడుని వరుడుగా భావించి తలంబ్రాలు పోసుకున్న జోగినిలు.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేములవాడ రాజన్నను వరుడుగా భావించి వివాహ మాడడం రాజన్న క్షేత్రంలో ఏండ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవం ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినీలు శివుడిని వరుడుగా భావించి వివాహం చేసుకున్నారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడిపారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని సాంప్రదాయం ఒక్క వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఆచారంగా వస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణం లో శివపార్వతులు, హిజ్రాలు, జోగినిలు పాల్గొంటారు. వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు, బంగారు ఆభరణాలు ధరించి, స్త్రీల కంటే అందంగా ముస్తాబై రాజన్న ఆలయంలో కల్యాణానికి హాజరవుతారు. తమకు తాము శ్రీ రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధం లోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి, పెళ్లి వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ప్రక్రియను ఆత్మవివాహంగా పరిగణిస్తారు. ఈ వేడుకల అనంతరం శివపార్వతులు, హిజ్రాలు, జోగిని లు సమాజం భగవంతుని ఆశీస్సులు కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలన్నదే దీని సంకేతంగా భావిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking