రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం.
వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ప్రసిద్ధ క్షైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఆదివారం ఉదయం 11:55 నిమిషాలకు అభిజిత్తు లగ్న సుముహూర్తాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ క్రతువులు ఆలయ అర్చకులు ఈశ్వరి గారి సురేష్, చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు, గణేష్, రాజు, ఘర్షకుర్తి శ్రీధర్ల బృందం చేతుల మీదుగా నిర్వహించగా రాచకొండ భాను – అనురాధ దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. వేడుకలలో భాగంగా కళ్యాణం అనంతరం పూర్ణాహుతి నిర్వహించి, సాయంత్రం రథోత్సవం, రాత్రి డోలోత్సవం ( వసంతోత్సవం ) నిర్వహించనున్నారు.
శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ కార్యాలయం తరఫున కమిషనర్ అన్వేష్ కార్యాలయ అధికారులు సిబ్బందితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక బిజెపి నాయకులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తి కళ్యాణం నిర్వహించిన అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారాల ఉత్సవమూర్తులను ఆలయ వెనుక భాగంలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కళ్యాణాన్ని అర్చకులు, వేద పండితులు, అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు, సుదూర ప్రాంతాల నుండి భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరైనారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో త్రాగునీరు, మజ్జిగ, అరటి పండ్లు అందజేశారు. కళ్యాణం అనంతరం ఆలయ పార్కింగ్ ప్రదేశంలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సుమారుగా 50వేల మంది భక్తులు హాజరైనట్లు రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
