జాతీయ రహదారి భూసేకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రక్రియ పూర్తి చేయాలి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 :
నాగపూర్ నుండి విజయవాడ వరకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి 163 (గ్రీన్ ఫీల్డ్) సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు.బుధవారం హైదరాబాద్ నుండి జాతీయ రహదారి 163 కు సంబంధించి భూ సేకరణలో భాగంగా రహదారి నిర్మించే జిల్లాలకు సంబంధించిన జిల్లాల కలెక్టర్లు,రాజస్వ మండల అధికారులతో భూసేకరణ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా నాగపూర్ నుండి విజయవాడ వరకు నిర్మించే జాతీయ రహదారి 163 లో మంచిర్యాల నుండి ఖమ్మం వరకు నిర్మించే జాతీయ రహదారికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.ఈ క్రమంలో భూములు కోల్పోయిన వారికి జాతీయ రహదారుల చట్టం ప్రకారం పరిహారం నిర్ధారించాలని, మంచిర్యాల జిల్లాలో 110.6 హెక్టార్లకు గాను 83.05 హెక్టార్ల భూమి అప్పగించబడి ఇంకా 27.59 హెక్టార్ల భూమి రావలసి ఉందని తెలిపారు. 12.81 హెక్టార్ల భూమికి సంబంధించిన పరిహారం అందించగా అధిక పరిహారం కోసం తిరిగి ఇవ్వడం జరిగిందని,5.33 హెక్టార్ల భూమి వివరాలు భూమిరాశి పోర్టల్ లో నమోదు చేయవలసి ఉందని,ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పరిహారం అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. 6.5 హెక్టర్ల ప్రభుత్వ భూమి ఉందని,2.8 హెక్టర్ల గ్రామ భూమికి సంబంధించి పరిహారం ఇవ్వవలసి ఉందని తెలిపారు.భూ సేకరణకు సంబంధించి ఆర్బిట్రేషన్ పరిహారం నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ కు మాత్రమే ఉంటుందని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సేకరణ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ…జాతీయ రహదారి163 విస్తరణలో భాగంగా జిల్లాలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో ప్రభుత్వ విధి విధానాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు,కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.