బేగంపేట్ సర్కిల్ లో రూ. 59.40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, మార్చి 04: నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బేగంపేట్ సర్కిల్ లో రూ. 59.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఎంపి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. మోండా మార్కెట్ డివిజన్ లో మూడు స్థలాల్లో రూ. 32.50 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం, ఈస్ట్ మారేడ్ పల్లిలో రూ. 25.50 లక్షల వ్యయంతో వి.డి.సి.సి రోడ్డు వేయడం, జీహెచ్‌ఎంసీ నర్సరీకి కార్బింగ్ అందించడం, ఈస్ట్ మారేడ్ పల్లిలో రూ. 1.40 లక్షలతో జీహెచ్‌ఎంసీ పార్కు-2 కాంపౌండ్ వాల్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… గత ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ప్రజా పాలన ప్రభుత్వం గత నాలుగు నెలల్లో జీహెచ్‌ఎంసీకి 700 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నగర ప్రజల తరఫున, జీహెచ్‌ఎంసీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో అభివృద్ధి పనులకు గాను ప్రతి జోన్ కు రూ. 25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ దీపిక, డిప్యూటీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.