ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

చీఫ్ ఎలెక్టోరల్ అధికారి సి. సుదర్శన్ రెడ్డి

ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
24.09.2024:
రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని చీఫ్ ఎలెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం నాడు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో స్పెషల్ సమ్మరీ రివీజన్ (ఎస్ఎస్ఆర్), ఈఆర్ఓ నెట్ 2.0 పై చీఫ్ ఎలెక్టోరల్ అధికారి సి. సుదర్శన్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చీఫ్ ఎలెక్టోరల్ అధికారి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా నూతన ఓటర్ నమోదుపై చేపట్టిన ఇంటింటి సర్వే పని తీరు చాలా మెరుగుపడిందని, ఇప్పటి వరకు 90 శాతంపైగా ఇంటింటి సర్వే పూర్తయిందని, సెప్టెంబర్ 28 నాటికి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి చేయాలన్నారు.
సెప్టెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న ఓటర్ల నమోదుకు సంబంధించి ఫార్మ్ 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వేలో ఆధార్ నంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చని, బలవంతం చేయరాదన్నారు. ఇంటింటి సర్వేకు సంబంధించి వచ్చిన నూతన ఓటర్ నమోదు దరఖాస్తుల వివరాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు.
యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 29లోపు పూర్తి చేయాలని సీఈఓ అధికారులను ఆదేశించారు.
ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంబంధిత ఎన్నికల ఏఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఓటరుకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం *జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో సమావేశమై ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి, ఓటరు జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పుల గురించి ఓటర్లకు వివరించాలన్నారు. మరణించిన ఓటర్లను తొలగించడం, ఫొటో గుర్తింపు కార్డుకు సంబంధించి సరిగాలేని ఫొటోలను సేకరించాలన్నారు. ఇంటి నంబర్, ఇతర సవరణ కోసం ఫార్మ్-8 ద్వారా ఓటర్ల నుంచి తీసుకోవాలన్నారు. అదే విధంగా 1-1-2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఓటరు నమోదుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ప్రజలు, విద్యార్థివిద్యార్థినిలు, యువకులు, మహిళా సంఘాలు, ఎన్జీవోలు, పూర్తిస్థాయిలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్ లు, ఎన్నికల సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking