మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహార్నగర్లో 3,619 మందికి ఇళ్ళస్థలాల పట్టాలు పంపిణీ
జవహార్నగర్ డంప్ యార్డులో రూ.250 కోట్లతో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం
జవహార్నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తాం
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 15:
తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ విషయంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ ఉత్తర్వులు 58 కింద అర్హులైన 3,619 మందికి ఇళ్ళ పట్టాలు అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం జిల్లాలోని జవహార్నగర్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జవహార్నగర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.250 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్దీకరణ ప్లాంట్ (లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారకరామారావు, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు ప్రారంభించారు.

అనంతరం జవహార్నగర్లో అర్హులైన 3,619 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తారకరామారావు మాట్లాడుతూ ఈ ప్రాంతవాసుల ఇబ్బందులు తీర్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఈ విషయంలో గత ఆరునెలల క్రితం చెప్పిన విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు 58 కింద ప్రస్తుతం 3,619 మందికి ఇళ్ళ ప్టాలను అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇంటి పట్టాలు అందించడం తాను చేసుకున్న అదృష్టమని పేదలకు ఇల్లు ఉంటే కలిగే ఆనందం ఎంతో ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58లో ఇంకా ఏమైనా సమస్యలు, అనుమానాలు ఉంటే జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీవోలు, కార్పొరేటర్లు సహకరిస్తారని మంత్రి కేటీఆర్ సభాముఖంగా తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59కి సంబంధించి కటాఫ్ 2014ల వరకు ఉంటే మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వల్ల దానిని 2020 వరకు పొడగించి అప్పటి వరకు అర్హులైన వారికి పట్టాలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

జవహార్నగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేసిన సమయంలో మొదటగా హైదరాబాద్ నుంచి ప్రతినిత్యం మూడు వేల టన్నుల చెత్త వచ్చేదని ప్రస్తుతం అది మూడింతలు పెరిగి ఎనిమిది వేల టన్నులకు చేరిందని దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల ఇబ్బందులు తీర్చడానికి రూ.250 కోట్లతో మురికి నీటి శుద్దీకరణ (లీచెట్ ట్రీట్మెంట్) ప్లాంట్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చిత్తశుద్ది ఉంటే సమస్యలు తీర్చవచ్చనే దానికి ఇది నిదర్శమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జవహార్నగర్లో చెత్తను అత్యతాధునిక పద్దతిలో శాస్త్రీయంగా శుద్ది చేయడం జరుగుతుందని ప్రజల సమస్యలు తీరుతాయని మంత్రి వివరించారు. ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే ఇక్కడకు వచ్చే చెత్తను వేర్వేరుగా చేయడం జరుగుతుందని అందులో తడి చెత్త నుంచి ఎరువును ఉత్పత్తి గ తయారు చేస్తున్నామని, పొడి చెత్తతో ఈ ప్రాంతంలో రూ.550 కోట్లతో ప్రత్యేకంగా ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోందని రూ.550 కోట్లతో వ్యయంతో త్వరలోనే మరో 28 మెగావాట్ల విద్యుత్తును మొత్తం 48 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తారకరామారావు స్పష్టం చేశారు. అదే విధంగా నిర్మాణం, శిథిలాలు (కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిష్) చేపట్టే క్రమంలో కంకర, మట్టితో స్టార్ డస్ట్ తయారు చేస్తున్నామని ప్రస్తుతం ఫతుల్గూడ, జీడిమెట్ల, శంషాబాద్తో పాటు మరో చోట ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమావేశంలో వివరించారు. దీంతో పాటు ప్రతినిత్యం దుండిగల్తో పాటు మరో ప్రాంతాల్లో డంపింగ్యార్డులను ఏర్పాటు చేసి ఒక్కో చోటకు 1,500 టన్నుల చెత్తను తరలిస్తున్నామని దీనివల్ల జవహార్నగర్కు కొంత ఇబ్బంది తగ్గిందని తెలిపారు. జవహార్నగర్లో ఉన్న సమస్యలన్నింటిని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని ఏడాది, ఏడాదిన్నరలో అందమైన జవహార్నగర్ రూపుదిద్దుకుంటుందని దీనికి తాను పూర్తి సహాయ సహకారాలు అందచేస్తానని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జవహార్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసే పార్కును ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకునేలా, పెద్దలు, మహిళలకు సౌకర్యవంతంగా అధునాతనంగా, అందంగా ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటానని మంత్రి తారకరామారావు వివరించారు. అలాగే అన్ని మతాల వారికి సౌకర్యవంతంగా ఉండేలా శ్మశానవాటిక (గ్రేవ్యార్డు) జవహార్నగర్లో పదిహేను ఎకరాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జవహార్నగర్ అంటే తనకు శ్వాస అని ఇక్కడి ప్రజలు తమకు పట్టాలు అందుతాయని, నీటి శుద్దీకరణ ప్రారంభానికి ఎంతో ఆనందంతో ఉన్నారని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని సమస్యలతో ఉన్న జవహర్ నగర్ ను జిల్లాలోనే నెంబర్వన్ గా తీర్చిదిద్దేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు. జవహార్నగర్తో పాటు దమ్మాయిగూడెం, నాగారం మున్సిపాలిటీల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి లేదని ప్రస్తుతం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అప్పట్లో లేని అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని రాబోయే రోజుల్లో జవహార్నగర్లో అత్యంత అద్భుతమైన పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇవ్వడంతో పాటు ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇంటిని నిర్మించుకొనేందుకు రూ. 3 లక్షలు అందచేస్తోందని తెలిపారు. జవహార్నగర్ ప్రజలకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని డంపింగ్ యార్డు వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరాయని ఇది ఎంతో ఆనందకరమైన విషయమని మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జవహార్నగర్లో అన్ని మతాల వారికి కలిపి ఒకే చోట శ్మశానవాటిక మంజూరు చేయాలని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కోరారు. అలాగే పార్కును కూడా ఏర్పాటు చేయాలని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి పిల్లలు, వృద్ధులకు సాయంత్రం వేళల్లో ఉండేలా వసతులు సమకూర్చాలని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్ళ పట్టాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అనంతరం ఇళ్ళపట్టాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , ఆర్డీవో రవి, , జవహర్ నగర్ మేయర్ కావ్య,. దమ్మాయిగుడా చైర్మన్ ప్రణీత,ఫీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.