శివ్వంపేట ప్రాజబలం న్యూస్ :-
దవాఖానకు వచ్చే రోగుల పట్ల కటువుగా ప్రవర్తించకుండా ప్రేమ పూర్వకంగా మెదలాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం శివ్వంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన, శివ్వంపేట మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సౌమ్య, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలన ను కచ్చితంగా పాటించి విధులకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించి, అందుకు తగిన ఔషధాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన హితబోధ చేశారు. ప్రస్తుత సీజనల్ వ్యాధులైన వైరల్, మలేరియా, డేంగి, టైఫాయిడ్ రోగాలు వస్తున్నాయని, సిబ్బంది ఈ రోగాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్, స్థానిక మెడికల్ ఆఫీసర్ సాయి సౌమ్య, డాక్టర్ పవన్ లతోపాటు ఆయా గ్రామాలకు చెందిన
సిబ్బంది తదితరులు ఉన్నారు.