ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 30:
వినాయక నిమజ్జనానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పై నిర్వహించిన సమన్వ సమావేశంలో అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, రాధికా గుప్తా,రాచకొండ డిసిపి కరుణాకర్, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ లతో కలిసి జిల్లా కలెక్టరు గౌతం పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17 చెరువులు ఉన్నాయని, వాటిలో వినాయక నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లును పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవటంతో పాటు నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసుకొని అందుకు అవసరమైన రూట్లలో రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాల్సిందిగా ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారులు సర్టిఫై చేయాలని ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఏర్పాట్లు చూడాలని పోలిస్ శాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు. వినాయక నిమజ్జనానికి చెరువుల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్లతో ఇద్దరు మెడికల్ అఫీసర్లు, కింది స్థాయి సిబ్బందితో మెడికల్ బృందాలను ఏర్పాటు చేసి 24 గంటలు షిప్టుల వారిగా విధులు నిర్వహించేలా, అదే విధంగా అంబులెన్సును అందుబాటులో ఉండేలా, అత్యవసర సమయాలలో బయటకు వెళ్లే దారి క్లియర్ గా ఉండేలా చూడాలని కలెక్టరు మెడికల్ అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాలు ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎమర్జేన్సి సందర్భంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశాలలో గతంలో కంటే అధిక సంఖ్యలో గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని జిల్లా మత్స్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. వినాయక నిమజ్జన స్థలాల వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు, పవర్ జేనరేటర్లను ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచడంతో పాటు వినాయక నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకొని అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్ మెంట్ వారు అవసరమైన మేరకు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తూ, ప్రతి చెరువు దగ్గర లైన్ మెన్ ను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ అధికారులకు కలెక్టరు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి వారు చెరువుల వద్ద పొల్యూషన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలన్నారు. గణేష్ నవరాత్రులు మొదలు కొని నిమజ్జనం పూర్తయే వరకు అగ్ని మాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మండపాలలో అనుకొకుండా అగ్నిప్రమాదం జరిగితే ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే అంశం పై అవగాహాన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అగ్నిమాపక అధికారులకు ఆదేశించారు. ప్రతి నిమజ్జన చెరువులకు ఒక నోడల్ ఆఫీసర్ తో పాటు సంబంధిత శాఖల సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయడం తోపాటు అదనంగా కొన్ని క్రేన్లను సన్నద్దం చేయాలన్నారు. శామీర్ పేట చెరువు దగ్గర అవసరమైన మోబైలు టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పోలీసు, ట్రాఫిక్, మత్స్య, వైద్య, అగ్నిమాపక, అర్ అండ్ బి, పొల్యూషన్, విద్యుత్తు, జలమండలి శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.