ఖమ్మం ప్రతినిధి జూలై 31 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, యడవల్లి కృష్ణ, నాగ సీతారాములు ఊకంటి గోపాలరావుతో కలిసి ఉదయం పది గంటలకు కొత్తగూడెం పాత బస్ డిపో దగ్గర నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు జరిగే మోటర్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. క్లబ్ లో జరిగే కార్యక్రమంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులకు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అనంతరం విద్యానగర్ కాలనీ, సాయిబాబా గుడి సమీపంలోని పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కావున కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై భారీ బైక్ ర్యాలీతో పాటు పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.