మాకు సర్కార్ కొలువు కావాలి..

నిత్యం 1300 మంది జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న అభ్యర్థులు

ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి
22 ఆగస్టు 2024:

సర్కారు కొలువు ఎందరో యువత జీవిత లక్ష్యం. ఆ ఆశయాన్ని సాధించాలనే లక్ష్యంతో కాలంతో పోటీ పడుతూ చదువులు సాగిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ప్రిపరేషన్‌ కోసం అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రతి రోజూ 1,300 మందికి పైగా నిరుద్యోగులు చదువుకోవడానికి జిల్లా గ్రంథాలయాలకు వెళ్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో నిత్యం 1,300 మందికిపైగా నిరుద్యోగులు చదువుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జూలైలో 40,450 మంది నిరుద్యోగులు చదువుకున్నట్లు గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు. అలాగే గ్రంథాలయాలన్నింటిలో 1.60 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండేళ్లలో రూ.1.15 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేసినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ప్రతీ నెల రూ.25 వేలు వెచ్చించి బుక్స్‌ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో మొత్తం 18 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 15 శాఖ గ్రంథాలయాలు, 2 గ్రామీణ గ్రంథాలయాలు, ఒకటి జిల్లా గ్రంథాలయం ఉంది. వీటిలో 14 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉండగా, మిగితావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో పాటు అంతకుముందు జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులు పుస్తకాలను వదలడం లేదు. ఇందులో కాస్త ఆర్థికంగా ఉన్నవారు హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకుంటుండగా.. పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత మాత్రం దగ్గరిలో ఉన్న గ్రంథాయాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటున్నారు. అలాగే ఇటీవల టెట్‌, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారు సైతం ప్రిపేర్‌ అవుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత

గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రీడర్స్‌ ఇబ్బంది పడుతున్నారు. 18 గ్రంథాలయాల్లో మొత్తం 23 సాంక్షన్‌ పోస్టులు ఉండగా, కేవలం ఏడుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 12 మంది లైబ్రేరీయన్లు ఉండాల్సి ఉండగా.. నలుగురు మాత్రమే ఉన్నారు. నలుగురు రికార్డు అసిస్టెంట్లకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు వాచ్‌మెన్‌లకు ఒక్కరే ఉన్నారు. ఐదు అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఒక్కో సిబ్బందికి మూడు నాలుగు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వాటి నిర్వహణ అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం నిరుద్యోగులు పెద్ద ఎత్తున లైబ్రరీలకు తరలి రావడంతో సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.
గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నా..

ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయగానే నిత్యం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి వస్తున్నాను. గ్రూప్స్‌కు ప్రిపర్‌ అవుతున్నాను. ఇంటి నుంచే బుక్స్‌ తెచ్చుకొని ఇక్కడ చదువుకుంటున్నాను. ఇక్కడ కూడా కాంపిటేషన్‌ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవసరమైన బుక్స్‌ అడిగితే ఇస్తున్నారు.
వంశీకృష్ణ,

గ్రంథాలయ ఇన్‌చార్జి సెక్రటరీ

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం..

నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వ ఉద్యోగం కోసం నెల రోజులుగా ప్రిపేర్‌ అవుతున్నా. నిత్యం గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బుక్స్‌ను బయటకు ఇవ్వడం లేదు. ఇక్కడే చదువుకొని వెళ్లాల్సి వస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking