భూపాలపల్లి ప్రజాబలం ప్రతినిధి:జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సయిజ్, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రేగొండ మండల పరిధిలోని పాండవుల గుట్టను రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల. మంత్రి దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు డా కడియం, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వర్ధన్న పేట శాసనసభ్యులు నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు, పురాతన కట్టడాలు, దేవాలయాలు, జలాశయాలు, అడవులు అధికంగా ఉన్న జిల్లా అని తెలిపారు. పాండవుల గుట్టకు ఎంతో ప్రాశస్త్యం ఉందని పాండవులు ఇక్కడ వనవాసం చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత యువతకు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. గొప్ప చారిత్రక ప్రదేశమని, ఈ గుట్టలో ఆనాటి కాలపు యొక్క పెయింటింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరలేదని ఆయన తెలిపారు. పాండవుల గుట్ట రాష్ట్ర, దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేస్తామని అన్నారు. అన్ని వయస్సుల వారు సందర్శిస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోప్ వే, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల మంత్రులు ద్వారా రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యాటకలు రావడానికి రహదారులు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు చాలా చక్కటి ప్రదేశమని తెలిపారు. పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ఆహారం సౌకర్యాలు కల్పనకు పర్యాటక శాఖ ద్వారా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాశ్వత తాత్కాలిక వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సిబ్బంది ఈ ప్రాంతంలో పర్యటించి అన్ని అంచనాలను తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి కేంద్రంగా ఈ ప్రాంతం నిలవాలని ఆయన సూచించారు. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయగలమని, మొదటి ప్రాధాన్యతగా పాండవుల గుట్టను చేపడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అంతకు ముందు పాండవుల గుట్టలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్, పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అటవీ అధికారి వసంత తదితరులు పాల్గొన్నారు.