-ఉద్యోగుల పని సంస్కృతి మెరుగు పడాల్సిన అవసరం ఉంది
-38వ నిర్మాణాత్మక సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 7:
పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గాల్సిన అవసరం ఉందని.. అలా జరిగితే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు మరిన్ని నూతన పథకాలను ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో జరిగిన 38వ నిర్మాణాత్మక సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకం ధరలు కోల్ ఇండియా ధరల కన్నా, విదేశీ బొగ్గు ధరతో పోల్చితే ఎక్కువగా ఉంటున్నాయని, కనుక మన బొగ్గుకు క్రమంగా డిమాండ్ తగ్గుతోందని, ఇది చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు. భూగర్భనుల్లో ఉత్పత్తి వ్యయం టన్నుకు 12 నుంచి 16 వేల రూపాయలకు చేరుకుంటుందన్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిగా వినియోగించాలన్నారు. గైర్హాజరీలు చేస్తున్న కార్మికులపై తీసుకునే కఠిన చర్యలకు సహకారం అందించాలని, తద్వారా క్రమశిక్షణను పెంచడం సాధ్యమవుతుందన్నారు. నాణ్యత పెంపుదలకు మరింత కృషి జరగాలన్నారు. ఈ అంశాలను సవాళ్లుగా స్వీకరించాలన్నారు. నేడు ప్రపంచం థర్మల్ విద్యుత్ నుండి సోలార్ విద్యుత్తు, ఇతర గ్రీన్ ఎనర్జీ విధానాల వైపు అడుగులు వేస్తోంది కనుక సింగరేణి సంస్థ కూడా తన మనుగడ కోసం సోలార్ విద్యుత్తు, కీలక ఖనిజాల ఉత్పత్తి వంటి వ్యాపార విస్తరణ చర్యలను చేపట్టాల్సి వస్తోందన్నారు. కార్మిక సంఘాలు కంపెనీ ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని కార్మికుల్ని చైతన్య పరచాలని. కంపెనీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తుంటారని, కంపెనీ అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతనిస్తే సింగరేణికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గతంలో సింగరేణి సంస్థను కష్టాల నుండి కాపాడడానికి కార్మికులు ఎన్నో త్యాగాలు చేశారని, ఇప్పుడు కూడా కంపెనీని అగ్రస్థానంలో నిలపడానికి కార్మికులు తమ వంతు కృషి చేస్తారన్నారు. అయితే కేవలం కంపెనీ ఉత్పత్తిని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా కార్మిక సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని రూపొందించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఆయన కోరారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం ద్వారా వివరించిన సమస్యలపై చర్యలు తీసుకుంటామని, ఆర్థిక పరమైన సమస్యలపై కమిటీలు వేసి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో సింగరేణి తరఫున ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదనకు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. కార్మికులకు సొంత ఇంటి పథకం సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్.వి.సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు(పి అండ్ పి), ఈడీ(కోల్ మూమెంట్) ఎస్ డి.ఎం.సుభానీ, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం శ్రీమతి కవితా నాయుడు, జీఎంలు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ తో పాటు వివిధ ఏరియా నుండి హాజరైన గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు అనేక ఉత్పత్తి సంబంధ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

సంస్థ ఛైర్మన్ పని విధానానికి ప్రశంసలు
ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక నాయకులు కొందరు మాట్లాడుతూ.. సంస్థ ఛైర్మన్ ఎన్. బలరామ్ ఎంతో సాదాసీదాగా కార్మికులతో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఒక ఛైర్మన్ గా కంటే కార్మిక నాయకునిగా కార్మికుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు.. గతంలో కార్మికులు ఛైర్మన్ ని కలవడం అనేది ఎంతో అసాధ్యంగా ఉండేదని, అయితే ఎన్.బలరామ్ ను అందరూ కలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన నిర్వహించిన చైతన్య యాత్రలో కార్మికులు నుండి అనేక సలహాలను ఆయన స్వయంగా విన్నారని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.