జిహెచ్ఎంసి లో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్లను అందజేసిన మేయర్
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, మార్చి 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్స్ ను సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. ఈ నియామకాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జిహెచ్ఎంసి కి కేటాయించిన అభ్యర్థుల్లో రిపోర్ట్ చేసిన 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాలకు కేటాయిస్తూ పోస్టింగ్ ఆర్డర్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఉద్యోగులకు అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ఇంత మందికి జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ కావద్దని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా అంకితభావంతో పనిచేసి కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే ఆ ఉద్యోగికి గుర్తింపుతో పాటు మరింత ఉన్నతంగా రాణిస్తారని అన్నారు. ముఖ్యంగా నగరంలో హెల్త్, శానిటేషన్ నిర్వహణ బాగుండాలని, ఆ విషయంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, ఏఎంసి జీవన్ కుమార్, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు,తదితరులు పాల్గొన్నారు.