గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరీశ్,
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 12:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్పేటలోని నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు వారికి అప్పగించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం శామీర్పేటలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఈనెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ హరీశ్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నూతన కలెక్టరేట్లో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్నందున ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి కలెక్టరేట్ ఆవరణను పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేదికను రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేయాలని ఈ విషయంలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. జిల్లాకు చెందిన ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శిస్తారని అందుకు సంబంధించి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించే క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గణతంత్ర వేడుకలకు వచ్చే జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం వేడుకలను తిలకించేందుకు వీలుగా ఉండేలా షామియానాలు (టెంట్లు), కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. అలాగే జాతీ పతాకావిష్కరణ అనంతరం ప్రసంగించేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఆయా పాటలను వినేందుకు అవసరమైన మైక్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ఐ &పి ఆర్ అధికారికి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణతో పాటు ప్రాంగణం మొత్తం ఎలాంటి దుమ్ము, దూళి రాకుండా ఉండేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసి వాహనాల రాకపోకల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పనులను చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు కలెక్టర్ హరీశ్ సూచించారు. జిల్లా నూతన కలెక్టరేట్ ఆవరణలో మొదటిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే తనకు తెలియజేయాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంమోహన్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లుతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.