తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా TANA), ప్రపంచ సాహత్యవేదికలు ‘‘బహుజన బంధు’’ పురస్కారంను ప్రకటించారు. ఈ పురస్కారంను జనవరి 1న, 2023 రవీంద్రభారతిలో నిర్వహించే బహుజనకళా ఉత్సవాలలో ఆయనకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఇతర ప్రతినిధుల సమక్షంలో అందచేస్తారు. తానా, ప్రపంచ సాహిత్య వేధిక, తారా ఆర్ట్స్ అకాడమి సహకారంతో తొలిసారిగా ‘‘బహుజన కళోత్సవాల’’ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైశిష్టం, వైవిధ్యం కలిగిన అన్ని సంప్రదాయ, జానపద, బహుజన కళారూపాలు ప్రదర్శింపబడతాయి. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా అంకితభావంతో బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ‘‘బహుజన బంధు’’ పురస్కారం అందజేస్తున్నారు. ఈ పురస్కారం డాక్టర్ వకుళాభరణంకు అందజేయడం సముచితం అని ‘‘పురస్కారం ఎంపిక సంఘం’ నిర్ణయించిన దరిమిలా ప్రకటించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 1, 2023 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారంను వకుళాభరణంకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తానా ప్రతినిధులు, వివిధ కళారూపాలు ప్రదర్శించే కళాకారులు, బహుజన సాహితీవేత్తలు పెద్దసంఖ్యలో పాల్గొంటారని వివరించారు.