ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ లో ప్రతిరోజూ వినూత్నంగా జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకలు మూడోరోజు మహిళా ఉద్యోగులు సంబురంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో ఎన్నికల భావనతో చేపట్టిన ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నికల సంబంధ లోగో, సి విజిల్, నినాదాలతో ఉద్యోగినులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ముగ్గులను ఆసక్తిగా తిలకించి పాల్గొన్నవారిని అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. సి విజిల్ ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి డౌన్లోడ్ చేసుకోవాలని, యువత కు అవగాహన కల్పించి డౌన్లోడ్ చేయించాలని అన్నారు. డబ్బు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటు వేయాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టే సామాజిక బాధ్యతను ప్రతిఒక్కరు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్, డిఆర్డీఓ విద్యాచందన, డిడబ్ల్యూఓ సుమ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, మహిళా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.