జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : జిల్లాలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ పరీక్ష ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.50 గం||ల వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి 11 గం॥ల వరకు మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.30 గం||ల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందు కొరకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.9 వేల 189 మంది రెగ్యులర్,221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని,పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని,పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని,పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పరీక్ష సమయానికి అనుకూలంగా టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని,విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని,ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ప్రశ్నా, జవాబు పత్రాల సురక్షిత రవాణా కొరకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలోని పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్యం నిర్వహణ పకడ్బంధీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో వార్షిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.