వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి త్రాగునీరు,విద్యుత్ వినియోగం,రైతు భరోసా,ఆహార భద్రత కార్డుల పరిశీలన,రబీ సీజన్ సాగు నీరు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రానున్న వేసవిలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలందరికీ నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు,చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు. వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.
కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి ఈవీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ,జిల్లాలో వ్యవసాయ రంగానికి, త్రాగునీటికి,నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని, రేషన్ కార్డుల కొరకు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను కలెక్టర్ సిఎస్ కు వివరించారు. ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్బిఎస్కే బృందాల ద్వారా ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు ప్రత్యేక ఆహారం మందులు తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.వసతి గృహ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలుపరుస్తున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను ఈ సందర్బంగా సిఎస్ అభినందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్ లు,ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, డిపివో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్,జాదవ్ కృష్ణ, డిఎస్ఓ కిరణ్ కుమార్,అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు