ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన మంత్రులు : పొంగులేటి శ్రీనివాస్, కొండ సురేఖ, సీతక్క
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి10
జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి లో భాగంగా ఆదివారం రూ.280.85 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్
సమాచార పౌర సంబంధాల శాఖల మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ , రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలతో కలసి ప్రారంభత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వరంగల్ లోని ఎస్ ఎన్ ఎం క్లబ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు రూ 4.10 కోట్లతో పుప్పాలగుట్టలో నిర్మించిన 1500 కిలో లీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్ఫేస్ రిజర్వాయర్ (ఈఎల్ఎస్ఆర్) ను, రూ 20 లక్షలతో ఏర్పాటుచేసిన
ఫాతిమా నగర్ జంక్షన్ ను మంత్రులు ప్రారంభించారు. అదేవిధంగా రూ. 272. 12 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అందులో రూ. 2 కోట్లతో ఖాజీపేట, క్యుసి ఆఫీస్ (జిడబ్ల్యుఎంసి), వడ్డేపల్లి, వెంకట్రామా, నాయుడు పెట్రోల్ పంప్, టిటిడి జంక్షన్ల వద్ద అభివృద్ధి, సుందరీకరణ పనులు, రూ 2 కోట్ల వ్యయంతో
బాలసముద్రం చిల్డ్రన్ పార్కు అభివృద్ధి పనులకు, 15 లక్షల
రూపాయల వ్యయంతో చేపట్టే
ఎంజిఎం పీడియాట్రిక్ బ్లాక్‌లో పిల్లలకు ఆట పరికరాల ఏర్పాటుకు, రూ 2 కోట్లతో
ఎస్ ఎన్ఎం క్లబ్, సికెఎం డివైడర్, బాలాజీ నగర్ జంక్షన్ల పరిధిలోని పలు జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులకు, రూ. 3.50 కోట్ల వ్యయంతో గోవిందరాజుల గుట్ట వద్ద ఎలివేటెడ్ లెవెల్ సర్ఫేస్ రిజర్వాయర్ (ఈఎల్ఎస్ఆర్) నిర్మాణ పనులకు , రూ. 250 కోట్లతో జిడబ్ల్యుఎంసి పరిధిలో వరద నీటి ముంపు నివారణకు అభివృద్ధి పనులకు, రూ 50 లక్షలతో వరంగల్ తూర్ఫు నియోజకవర్గం శివనగర్ లోని 34వ డివిజన్ లోని మెట్ల బావి అభివృద్ధి కు, రూ 10 కోట్ల వ్యయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, అవెన్యూ ప్లాంటేషన్ పనులకు, రూ 6.60 కోట్లతో నర్సంపేట మరియు ఖమ్మం రోడ్డులో, కరీంనగర్ మరియు ములుగు భారీ ముఖ ద్వార నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను ప్రభుత్వం వారి చెంతకు చేర్చిందని, ప్రజల మనసులలో కోరికగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నేడు (సోమవారం) ఆవిష్కరిస్తారని, ఎన్నికల నియమావళి రాకముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేలా చూడలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో పేదవారికి లబ్ధి చేకూర్చేలా పథకాల అందజేత జరగలేదని, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగిందని, చెప్పిందే తడవుగా మన ప్రభుత్వం 72 రోజుల్లో 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, టి ఎస్ పి ఎస్ సి ని ప్రక్షాళన చేసి నిబద్ధతగల సిబ్బందిని నియమించి యుద్ధ ప్రతిపాదికన నోటిఫికేషన్లు ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే సుమారు 11,600 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, చిన్న గూడు కట్టుకోవాలన్నా అది ఇందిరమ్మ రాజ్యం ద్వారా మాత్రమే సాధ్యమే అని నమ్మి ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి మీ ఇంటి వద్దకే వచ్చి మీకేమి కావాలో తెలుసుకోవడం జరిగిందని, మీరు కోరిన కోరికలను ఒక్కొక్కటిగా తీరుస్తూన్నామని, మీరు కన్న కలలను ఒక్కొక్కటిగా సహకారం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఉద్యోగస్తులకు ఒకటో తారీకు నుండి మూడో తారీకు లోగా జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తమదని ఈ సందర్భం గా మంత్రి తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు రావడం గర్వంగా ఉంది: మంత్రి కొండ సురేఖ
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
చేసుకుని మీ ముందు మాట్లాడడం గర్వంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. మంత్రులతో కలిసి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ GWMC అధ్వర్యంలో ఆదివారం లక్ష వృక్షార్చన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో రోడ్ల వెంబడి పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరుగుతుందని తెలిపారు.
ఈ సంవత్సరం ఒక లక్ష చెట్లు నగర రహదారుల వెంట నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రధాన రహదార్లు, కాలనీ రోడ్లలో ఈ కార్యక్రమం జరుగుతుందనీ
వచ్చే 3 సంవత్సరాలలో వరంగల్ నగరంలో పచ్చదనం పెంపొందించి హరిత నగరంగా తీర్చి దిద్దడం జరుగుతుందని,ఇందులో వరంగల్ ప్రజలు కూడా భాగస్వాములై వారి కాలనీలలో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.అలాగే వరంగల్ నగరంలోని అన్ని లేఅవుట్ ఖాళీ ప్రదేశాలను అందమైన వివిధ రకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగిందని,దీనికి తోడుగా నగరంలో అన్నీ జంక్షన్లను అభివృద్ధి చేసి సుందరీకరించడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేయనున్నామని, ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అభివృద్ధి మీద ఉన్న ఆకాంక్ష వల్ల ముఖ్యమంత్రి నగరానికి సుమారు రూ. 260 కోట్ల నిధులను అందజేయడం జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి డా.దనసరి అనసూయ (సీతక్క)
ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశలో ముందుకు సాగుతుందని,మంత్రి సీతక్క అన్నారు. అధికారంలోకి వచ్చిన 75 రోజులలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తూ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా సుమారు 5 నుండి 6 వేల రూపాయలు ఆదా చేస్తున్నామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అందజేసే ప్రక్రియలో భాగంగా జీరో బిల్లుల వల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించి తమ అందరి ముందు ఉంచుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని అయినప్పటికిని ఒకటవ తేదీలోగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని, గతంలో ఇందిరా గాంధీ నుండి నేటి సోనియా గాంధీ వరకు విద్య రాజకీయం వంటి తదితర రంగాలలో మహిళలకు విస్తృతమైన అవకాశాలను కల్పించిందని, మహిళలను అగ్రభాగాన నిలబడతామని, ఆనాడు స్వాతంత్ర్య సంగ్రామం లో మహిళలు ఉన్నారని ప్రస్తుతం సంక్షేమ ఫలాలు మహిళలకు అందజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని సితక్క తెలిపారు.
సీఎంకు ధన్యవాదాలు తెలిపిన నగర మేయర్ గుండు సుధారాణి….
నగర పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు వరంగల్ నగరం ముంపుకు గురికాకుండా రూ 250 కోట్లు కేటాయించడం, టి యు ఎఫ్ ఐ డి సి నిధుల ద్వారా స్ట్రాంమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి భవిష్యత్తులో వరంగల్ నగరం ముంపుకు గురి కాకుండా నిధులు అందజేస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేసిన మేయర్ జంక్షన్ల అభివృద్ధి, మెట్ల బావి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
వర్డన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ…
అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రభుత్వం దూసుకుపోతుందని, అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని,ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రూప్-1,2,3 ఉద్యోగాల భర్తీ కోసం, టీచర్ ఉద్యోగాల నియామకాల కోసం మేఘా డి ఎస్ సి నోటిఫికేషన్ లను ఇవ్వడం జరిగిందని, నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులు కోరారు.వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్ధి జరగాలని కోరారు.లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు మహిళా శిశు సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో రూ. 19 లక్షల విలువగల 12 ద్విచక్ర వాహనాలు( మోటరైజ్డ్ వాహనాలు),5 బ్యాటరీ వీల్ చైర్లను మంత్రుల చేతుల మీదుగా దివ్యాంగ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురలినాయక్, కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, తూర్పాటి సులోచన సారయ్య, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, గుండు చందన పూర్ణ చందర్, గుండేటి నరేందర్, పస్కుల బాబు, ముష్కమల్ల అరుణ సుధాకర్, కావేటి కవిత,పోశాల పద్మ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,ఆర్ డి ఓ కృష్ణవేణి,జి డబ్ల్యు ఎం సి ఎస్ ఈ లు కృషా రావు,ప్రవీణ్ చంద్ర సి ఎం హెచ్ ఓ డా.రాజేష్ తో పాటు రెవెన్యూ పోలీస్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ,ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.