వన మహోత్సవం క్రింద మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేయాలి.
ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమము
…..రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా, ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమము పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
……వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి
సంగారెడ్డి ఆగష్టు 02 ప్రజ బలం ప్రతినిధి: ఆగస్టు 5 నుంచి 9 వరకు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం క్రింద గ్రామాలు, పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు, షెడ్యూల్ ను సీఎస్ వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ పారిశుధ్యం, పచ్చదనం ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలలో, ప్రతి పట్టణ వార్డులో స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఆగస్టు 6న త్రాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, ఆగస్టు 7న మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, గుంతలను పూడ్చడం, ఆగస్టు 8న సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన, వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు, ఆగస్టు 9న ఫ్రైడే డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణకు గ్రామ స్థాయిలో, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ నియమించాలని అన్నారు.
ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారిని , మున్సిపల్ వార్డులకు గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని, గ్రామ స్థాయి బృందంలో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఆశా వర్కర్, గ్రామ సంఘంలోని 3 ఆఫీస్ బేరర్స్, ఇతర గ్రామస్థాయి సిబ్బంది , వార్డ్ బృందంలో స్థానిక కౌన్సిలర్/కార్పొరేటర్, వార్డు అధికారి ప్రత్యేక అధికారి, రిసోర్స్ పర్సన్స్ అధ్యక్షులు ఉంటారని సీఎస్ తెలిపారు. గ్రామాలు, వార్డులలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని పేర్కొన్నారు. స్వచ్చదనం – పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన బృందాలు క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం సక్రమంగా అమలయ్యే విధంగా జడ్పి సీఈఓ, డిఆర్డిఓలు జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పర్యవేక్షించాలని అన్నారు. భవిష్యత్తు లో సైతం గ్రామాలు, పట్టణాలలో స్వచ్చదనం – పచ్చదనం కొనసాగేందుకు ఇక పై ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్చదనం – పచ్చదనం దినంగా నిర్వహించడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు రెగ్యులర్ గా మానిటర్ చేయాలని సీఎస్ సూచించారు. మన గ్రామాలు పట్టణాలను పరిశుభ్రత, పచ్చదనం పెంపొందేలా తీర్చిదిద్దాలని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేయాలని సీఎస్ అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొని మాట్లాడారు .అన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, తెలియజేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జడ్పిసిఓ జానకి రామ్ రెడ్డి, పిడి డిఆర్డిఓ జ్యోతి, జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, అదనపు పీడీ డిఆర్డిఓ జంగారెడ్డి, కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.